అమరావతి విస్తరణ వదంతులేనా.. మంత్రి నారాయణ ఏం చెప్పారు?
రాజధాని ఐదువేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని...దానికోసం భూమి అవసరం ఉందని మంత్రి నారాయణ వెల్లడించారు.
By: Tupaki Desk | 15 April 2025 6:40 PM ISTరాజధాని విస్తరణపై జరుగుతున్న ప్రచారంపై మున్సిపల్ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం నిర్మిస్తున్న అమరావతిని మరో 44 వేల ఎకరాలకు విస్తరించాలనే ప్రణాళికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. కేవలం రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఒక్కటే పరిశీలనలో ఉందని, దీనిపైనా నిర్ణయం తీసుకోవాల్సివుందన్నారు. దీంతో రెండు రోజులుగా అమరావతి విస్తరణపై జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం తొలిసారిగా స్పందించినట్లైంది.
రాజధాని ఐదువేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని...దానికోసం భూమి అవసరం ఉందని మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధానిలోని అనంతవరంలో గ్రావెల్ క్వారీలను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం రాజధాని పనులతోపాటు అమరావతి విస్తరణపై క్లారిటీ ఇచ్చారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి మెగాసిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు ఉన్నారని మంత్రి తెలిపారు. అందుకే అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించామన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా భూములు తీసుకుంటే కేవలం రిజిస్ట్రేషన్ ధరలో రెండున్నర రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని...అలా కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు.రైతులు కూడా ల్యాండ్ పూలింగ్ ను కోరుకుంటున్నారన్నారు. భూసమీకరణ ద్వారా ఎయిర్ పోర్ట్ కోసం ముప్పై వేల ఎకరాలు సమీకరించాల్సి ఉంటుందన్నారు. వీటిలో రైతులకు రిటర్న బుట్ ప్లాట్లు ఇవ్వగా మిగిలిన భూముల్లో రోడ్లు,డ్రెయిన్లు,ఇతర మౌలిక వసతుల కోసం మరికొన్ని వేల ఎకరాలు అవసరం ఉంటుందన్నారు. ఇవన్నీ పోగా ఇంకా ఐదువేల ఎకరాలు మాత్రమే మిగులుతుందన్నారు.
ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎక్కువ భూమి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ విషయంలో భూ సమీకరణ లేదా భూసేకరణ అనేది ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు..అమరావతి నిర్మాణం కోసం 2015లో కేవలం 58 రోజుల్లోనే రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలు భూమిని ఇచ్చారనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కాగా, గత ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిందని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు..పనులు మధ్యలో నిలిపివేసిన నాటి ప్రభుత్వం....అప్పటి టెండర్లను కూడా రద్దు చేయకపోవడంతో న్యాయ సమస్యలు రాకుండా వాటినన్నింటిని పరిష్కరించాల్సి వచ్చింది. దీనికోసం 8 నెలల సమయం పట్టిందన్నారు. ప్రస్తుతం రాజధానిలో పనులు ప్రారంభమయినట్లు మంత్రి తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయన్నారు మంత్రి నారాయణ...ఒక నిర్ధిష్ట కాలపరిమితితో పనులు పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామన్నారు...ఏడాదిలో అధికారుల నివాస భవనాలు పూర్తి చేస్తామన్నారు...ఏడాదిన్నరలో ట్రంక్ రోడ్లు,రెండున్నరేళ్లలో లేఅవుట్ రోడ్లు,మూడేళ్లలో ఐకానిక్ భవనాలు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు.