అమరావతి అద్భుతానికి ఐదు మార్గాలు..! అవేంటి అంటే?
అయితే ఈ పనులు కొలిక్కిరావడంపైనే కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్దేశిత సమయంలో పనులు పూర్తికావాలంటే ప్రభుత్వం ఐదు కీలకాంశాలను దృష్టిలో పెట్టుకోవాలని అంటున్నారు.
By: Tupaki Desk | 3 May 2025 11:15 PM ISTఅమరావతి ఏపీ ప్రజల కలల రాజధాని. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న ప్రజా రాజధాని కల సాకారం అవ్వాలంటే ఎన్నో అడుగులు పడాలి. మూడేళ్లలో పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతున్నా, ఎన్నో సవాళ్లను అధిగమించాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 11 ఏళ్లు కావస్తోంది. విభజిత్ ఆంధ్రప్రదేశ్ లో రెండో ఏడాదే అంటే 2015లో రాజధాని నిర్మాణానికి అడుగులు పడినా, 2019లో ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇక కూటమి ప్రభుత్వం కొలువు దీరిన నుంచి రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అయితే ఈ పనులు కొలిక్కిరావడంపైనే కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్దేశిత సమయంలో పనులు పూర్తికావాలంటే ప్రభుత్వం ఐదు కీలకాంశాలను దృష్టిలో పెట్టుకోవాలని అంటున్నారు.
రాజధాని అమరావతి రీస్టార్ట్ అంటూ కూటమి ప్రభుత్వం చాలా హడావుడి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నెల 2న పనులు పునఃప్రారంభమయ్యాయి. ఇంధ్రలోక రాజధానిగా ప్రధాని మోదీ అభివర్ణించిన అమరావతి.. ప్రధాని చెప్పినట్లే ఏపీకి గ్రోత్ ఇంజిన్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అధునాతన ప్రదేశ్ గా మార్చుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ఇక రాజధాని అమరావతిని ఎన్నో అంశాల్లో మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గతానుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచనలు వస్తున్నాయి.
నిర్దేశిత సమయం
తొలి నుంచి రాజధాని అమరావతి పనులు ఓ ప్రణాళిక ప్రకారం జరగడం లేదని టాక్ వినిపిస్తోంది. 2015-19 మధ్య హడావుడి తప్ప క్షేత్రస్థాయిలో పనులు నత్తనడకన సాగడం వల్ల చాలా పనులు మధ్యలో నిలిచిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మూడేళ్లు లక్ష్యంగా పెట్టుకున్నందున ప్రభుత్వం ప్రతి అంశాన్ని నిర్దేశించిన ప్రకారం అధికారులు, ఇంజినీర్లు నడుచుకోవాల్సివుటుందని అంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షించాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలనలో ‘‘సోమవారం-పోలవారం’’ అన్నట్లు ప్రతి వారం పనులను సమీక్షించి ఆ ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేయించారు. ఇప్పుడు కూడా సీఎం ఆ స్థాయిలో ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.
సమన్వయం - సహకారం
రాజధాని పనులు ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకం. సకాలంలో పూర్తి చేసి ఆ క్రెడిట్ పొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. అయితే రాష్ట్ర మంత్రివర్గంలో అమరావతిపై పెద్దగా సమన్వయం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ మంత్రిగా నారాయణ ఒక్కరే రాజధాని పనులు పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన మంత్రులు ఎవరూ అమరావతి పనులల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఈ పరిస్థితికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి నారాయణపై ఒత్తిడి తగ్గించేలా మరికొందరు మంత్రులతో కమిటీని నియమించి రాజధాని పనుల బాధ్యతలను అప్పగించాలని సూచిస్తున్నారు.
నిధుల సేకరణ
రాజధాని నిర్మాణానికి దాదాపు 60 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ప్రస్తుతం రాజధాని కోసం సుమారు రూ.31 వేల కోట్ల రూపాయలను మాత్రమే సేకరించగలిగారు. మిగిలిన నిధులను సాధ్యమైనంత తొందరగా సాధించాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రస్తుతానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మన్ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్లు ప్రభుత్వం సేకరించింది. ప్రపంచ బ్యాంకు నిధులు దశలవారీగా ఆరేళ్లలో వస్తాయి. కానీ, మూడేళ్లలోనే పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. అంటే మూడేళ్ల కాలానికి ముందుగా నిధులు సర్దుబాటు చేసుకోవాల్సివుంటుందని అంటున్నారు. అదేవిధంగా గతంలో ప్రజల నుంచి సేకరించిన విధంగా మళ్లీ విరాళాలు తీసుకునే అవకాశాలు చూడాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా రాజధాని సెస్సు విధించే మార్గాలు ప్రభుత్వానికి కొంతవరకు నిధుల సమస్యను తీర్చుతాయనే ప్రతిపాదనలు వస్తున్నాయి.
కేంద్రం సహకారం
రాజధాని నిర్మాణానికి ముఖ్యమైనది కేంద్రం సహకారం. 2014-19 మధ్య చంద్రబాబు-మోదీ ప్రభుత్వాల మధ్య పొత్తు ఉన్నప్పటికీ, రాజధానిపై కేంద్ర పెద్దలు ద్వంద్వ ప్రమాణాలు పాటించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని నిందలు మోశారు. ఆ సమయంలో చంద్రబాబు మద్దతు అవసరం లేకపోవడంతో బీజేపీ ప్రభుత్వం ఏపీ రాజధానిని నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు మద్దతుతోనే కేంద్రం కొనసాగుతుండటం వల్ల రాజధాని విషయంలో పట్టు వదలకుండా కేంద్రంపై ఒత్తడి తెచ్చి అనుమతులు సాధించాలని సూచనలు వస్తున్నాయి.
స్థానిక పాలన
అమరావతి సాకారం కావాలంటే స్థానికంగా పాలన సాగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జీఏడీ భవనాలు విజయవాడలో ఉన్నాయి. సెక్రటేరియట్ అమరావతిలో ఉంది. సీఎం ఉండవల్లిలో ఉన్నారు. ఇలా కాకుండా కొన్నాళ్లు పాటు అమరావతి కేంద్రంగానే పాలన సాగిస్తే ప్రజల రాకపోకలు పెరుగుతాయి. పెట్టుబడులు కూడా పెరుగతాయని అంటున్నారు. అంతేకాకుండా పనుల పర్యవేక్షణ కూడా సులువుగా ఉంటుందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఐదు సూత్రాలను పాటిస్తే రాజధాని నిర్మాణం అనుకున్న సమయంలో పూర్తి చేయవచ్చని అంటున్నారు.
