అమరావతి నిర్మాణంలో కీలక అడుగు!
ఏపీ కలల రాజధాని అమరావతి నిర్మాణంలో పురోగతి మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి రాజధాని పనులను పట్టాలెక్కించేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది.
By: Tupaki Desk | 3 April 2025 10:09 AM ISTఏపీ కలల రాజధాని అమరావతి నిర్మాణంలో పురోగతి మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి రాజధాని పనులను పట్టాలెక్కించేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. వాటి ఫలితంగా నిధుల సేకరణతోపాటు టెండర్లు, కాంట్రాక్టర్ల ఎంపిక వంటి పనులు చకచకా జరిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని నిర్మాణానికి ఇప్పటికే సుమారు 40 వేల కోట్లను సేకరించిన ప్రభుత్వం తొలి విడత డబ్బును అందుకుంది. ప్రపంచ బ్యాంకు మంజూరు చేసిన రూ.15 వేల కోట్లలో ఫస్ట్ ఫేజులో సుమారు రూ.3,535 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యాయి. దీంతో అమరావతి పనుల ప్రారంభం, బిల్లుల చెల్లింపులకు ఇబ్బంది తొలగినట్లైంది.
2015లో శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి పనులు 2019 వరకు కొనసాగాయి. ఆ నాలుగేళ్లలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలతోపాటు అఖిల భారత సర్వీసు అధికారులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను కొలిక్కి తీసుకువచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అప్పట్లో నిర్మించిన భవనాల్లోనే కొనసాగుతుండగా, అఖిల భారత సర్వీసు అధికారులు, న్యాయమూర్తుల క్వార్టర్సు చివరి దశలో నిలిచిపోయాయి. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై వైఖరి మార్చుకోవడంతో రాజధాని నిర్మాణం ఎక్కడికక్కడే ఆగిపోయింది. ఐదేళ్ల తర్వాత మళ్లీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాతే రాజధాని పనులు పట్టాలెక్కాయి.
ప్రస్తుతం రాజధాని వ్యాప్తంగా జంగిల్ క్లియరెన్సు జరిగింది. ఇక ప్రపంచబ్యాంకు, హడ్కో, జపాన్ బ్యాంకుల నుంచి రుణం మంజూరు కావడంతో నిధుల కొరత తీరిపోయింది. ప్రస్తుతం తొలి విడత రుణంగా రూ.3,535 కోట్లు అందడంతో రాజధానిలో పనులు సందడి మొదలైంది. ఈ నెల మూడో వారంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా పనుల పునఃప్రారంభించనున్నారు. ఇందుకోసం చురుగ్గా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాజధానిలో మౌలిక సదుపాయాల పనులతోపాటు రైతుల ప్లాట్ల అభివృద్ధి పనులు తొలివిడతగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు చేతినిండా పని దొరుకుతుందని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలు తమ కార్మిక సిబ్బంది కోసం తాత్కాలిక షెడ్లను నిర్మిస్తున్నాయి. త్వరలో వేలమంది కార్మికులు రానుండటంతో వారికి వసతి సమస్య లేకుండా రాజధానిలోనే ఏర్పాట్లు చేస్తున్నారు.
మళ్లీ సింగపూర్ మోడల్
అమరావతి రాజధాని ప్రాంతంలో బుధవారం సింగపూర్ కన్సార్షియం బృందం కూడా పర్యటించింది. స్టార్టప్ ఏరియా నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కోరిక మేరకు సింగపూర్ కన్సార్టియం పర్యటించింది. కోర్ క్యాపిటల్ పరిధిలోని నిర్మాణాలను పరిశీలించింది. గతంలో రాజధానిలో సింగపూర్ స్టార్టప్ ఏరియా కోసం ఉద్దండరాయునిపాలెం-తాళాయపాలెం పరిధిలో 1900 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులు ఆగిపోవడంతో కూటమి ప్రభుత్వం మళ్లీ సింగపూర్ కన్సార్టియంను ఆహ్వానించింది. దీంతో రాజధానిలో సింగపూర్ ప్రతినిధులు పర్యటించి సచివాలయంలో సీఎస్ విజయానంద్ తోపాటు ఇతర అధికారులతో భేటీ అయ్యారు.
