Begin typing your search above and press return to search.

టీడీపీని 2029లో గెలిపించే ఆయుధం అదేనట ?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలను అంచనా కట్టడం ఎవరి తరమూ కాదు. ఆయన అనుకున్నది సాధిస్తారు.

By:  Tupaki Desk   |   11 April 2025 6:00 AM IST
Amaravati: Chandrababu’s Ultimate Masterstroke for 2029
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలను అంచనా కట్టడం ఎవరి తరమూ కాదు. ఆయన అనుకున్నది సాధిస్తారు. అదే సమయంలో తాను అనుకున్న గమ్యస్థానానికి చేరేందుకు దారులు కూడా వెతుక్కుంటారు. ఏపీలో 2024 ఎన్నికల్లో 164 సీట్లతో గెలిచామన్న సంబరం అయితే టీడీపీ అధినాయకత్వానికి ఉంది కానీ దానికి మించి 2029లో ఆ భారీ సక్సెస్ ని రిపీట్ చేయాలన్న గట్టి సవాల్ ని కూడా స్వీకరించే సత్తా కూడా ఉంది.

అందుకే బాబు 2024 జూన్ 12న అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అదే పని మీద ఉన్నారని అంటున్నారు. ఆయన డే వన్ నుంచి తన యాక్షన్ ప్లాన్ ని అమలు చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నమ్ముకున్నది అమరావతిని. ఏపీ ప్రజల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న రాజధానిని. నిజానికి 2014 సమయంలో ఏపీ ప్రజల భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే.

బంగారం లాంటి హైదరాబాద్ రాజధాని పోయింది. అదే సమయంలో రాజధాని అన్న చిరునామా లేకుండా తలలేని మొండెంతో ఏపీ ఆవిర్భవించింది. ఈ కారణంగానే ప్రజలు అప్పటికే మంచి ఊపు మీద ఉన్న వైసీపీని కాదని విజనరీ అభివృద్ధి కారకుడు అని తలచి చంద్రబాబుకు పట్టం కట్టారు.

ప్రజల తీర్పుని సరిగ్గానే అర్ధం చేసుకున్న చంద్రబాబు అమరావతి పేరుతో రాజధాని నిర్మాణానికి ఆ మరుసటి ఏడాది అంటే 2015 అక్టోబర్ 22నే శ్రీకారం చుట్టారు. కానీ ఎక్కువగా భారీ డిజైన్లు సెలక్షన్లూ అంటూ కీలకమైన కాలాన్ని వెచ్చించడంతో 2019 నాటికి ఒక రూపుకూ షేపూకూ తేలేకపోయారు. ఇక 2019లో ఆయన ఓటమి పాలు అయ్యారు.

వైసీపీ అధికారంలోకి వచ్చినా ప్రజల సెంటిమెంట్ ని మరచింది. ఆ అయిదేళ్ళూ మూడు రాజధానులు అంటూ ఆ పార్టీ చేసిన విన్యాసాల మూలంగా రాజకీయంగా 2024లో గట్టి దెబ్బ తింది. దీంతో ఇపుడు అన్నీ ఎరిగిన చంద్రబాబు నాలుగవసారి సీఎం అయ్యారు. ఆయన తొలి ప్రాధాన్యత మాత్రమే కాదు అత్యధిక ప్రాధాన్యతగా కూడా అమరావతి రాజధానిని ఎంచుకున్నారు.

గడచిన పదినెలలలో ఆయన దీని కోసం చేసిన కసరత్తుకు తగిన ప్రతిఫలం దక్కుతోంది. కేంద్ర ఆర్ధిక సాయంతో పాటు రుణ సాయం కూడా లభితోంది. ఇక అమరావతి పనులకు ఏ మాత్రం ఆటంకాలు అయితే లేవు. ఈ నెల మూడవ వారంలో ప్రధని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఘనంగా అమరావతి రాజధాని నిర్మాణం పనులు మొదలవుతున్నాయి. ఏకంగా 45 వేల కోట్ల రూపాయల అతి పెద్ద మొత్తంతో అమరావతి పనులు సాగడం అంటే మామూలు విషయం కాదు.

ఇక ఈ రాజధాని పనులకు ఒక నిర్దిష్ట కాలపరిమితిని కూడా ఎంచుకున్నారు. 2028 నాటికి తొలిదశ పనులు పూర్తి అవుతాయి అని అంటున్నారు. అంటే 2029 ఎన్నికల నాటికి అమరావతి రాజధాని జనం కళ్ళ ముందు ఉంటుంది అన్న మాట. ఆ పని కనుక బాబు సాధిస్తే ఆయన సూపర్ సక్సెస్ అయినట్లే అని అంటున్నారు.

ఏపీ ప్రజలకు రాజధాని అన్నది ఒక సెంటిమెంట్. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి వారికి మద్రాస్ వదిలేశారు. అలాగే ఆరు దశాబ్దాల పాటు కొనసాగి హైదరాబాద్ కూడా వదిలేశారు. ఇపుడు అమరావతితో ఆంధ్రులు తలెత్తుకుని తిరుగుతారు అన్నది వాస్తవం. ఇది మన రాజధాని. ఇక ఎవరూ దీనిని టచ్ చేయలేరు, ఏ పేచీ పూచీలు లేకుండా ఏపీకి రాజధాని ఉంటుందని గట్టిగా చెప్పుకోవచ్చు అని అయిదు కోట్ల ఆంధ్రులు మనసా వాచా తలుస్తారు

అదే అద్భుతమైన వరంగా మారి 2029 ఎన్నికల్లో టీడీపీ కూటమి మీద ఓట్ల జల్లుగా కురుస్తుంది అని అంటున్నారు. అలా సెంటిమెంట్ ఆయుధంతోనే చంద్రబాబు 2029 ఎన్నికలలో ఇంతకు ఇంత సీట్లతో భారీ విజయాన్నే సొంతం చేసుకోవాలని మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు. బాబుకు ఈసారి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా దన్నుగా నిలవడం శ్రీరామ రక్షగా ఉంది.

ఏది ఏమైనా హైదరాబాద్ పేరు చెబితే హైటెక్ సిటీ గుర్తుకు వచ్చి చంద్రబాబునే తలుస్తారు. అలాగే అమరావతి పేరు చెబితే బాబునే భవిష్యత్తు తరాలు సదా గుర్తు చేసుకుంటాయి. అమరావతి రాజధానితో బాబు ఎన్నికల్లోనే గెలవడం కాదు ఆంధ్రుల గుండెల్లోనూ శాశ్వతంగా నిలిచిపోతారని అంటున్నారు. సో అమరావతి పూర్తి అయితే బాబు ఏపీకి శాశ్వత సీఎం. ఎనీ డౌట్స్.