Begin typing your search above and press return to search.

అమరావతికి కేంద్రం మరో వరం

ఏపీకి ఏఅకైక శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండు నెలల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది.

By:  Satya P   |   11 Jun 2026 7:00 AM IST
అమరావతికి కేంద్రం మరో వరం
X

ఏపీకి ఏఅకైక శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండు నెలల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. దాని కంటే ముందు జాతీయ బ్యాంకులన్నీ అమరావతిలో ఏర్పాటు చేస్తూ శంకుస్థాపనలు కూడా జరిగాయి. ఇవే కాకుండా అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అమరావతికి కేటాయిస్తున్నారు. అలాగే అమరావతి నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాలకు కలుపుతూ రోడ్ కనెక్టివిటీ రైలు కనెక్టివిటీని కూడా పెంచుతున్నారు. ఈ క్రమంలో అమరావతికి మరో వరాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

మంత్రి వర్గం ఆమోదం :

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతి నిర్మాణానికి తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఇక రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి పట్టణ కేంద్రంగా రూపుదిద్దుకోవాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న నేపధ్యంలో ఈ ప్రాజెక్టు కీలకంగా నిలుస్తుందని అంటున్నారు. అంతే కాకుండా వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా వాటికి పెరుగుతున్న కార్యాలయ వసతి డిమాండ్‌ను తీర్చడమే ఈ ప్రతిపాదన లక్ష్యంగా కూడా చెబుతున్నారు. ఈ ఏకీకరణ విధానం వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించే సేవల సామర్థ్యాన్ని సైతం ఈ నిర్ణయం మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.

అయిదున్నర ఎకరాలలో :

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతిని 5.53 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ నిర్మాణంలో రెండు బ్లాకులు ఉండబోతున్నాయి. ఒకటి ప్లాట్ సి-9లో గ్రౌండ్ ప్లస్ 13 అంతస్తులతో సేవల కోసం, మూడు అంతస్తులు పోడియం పార్కింగ్‌ కోసం, పది అంతస్తులు కార్యాలయాల కోసం కూడిన బ్లాకు కాగా, మరొకటి ప్లాట్ సి-8లో గ్రౌండ్ ప్లస్ 10 అంతస్తులతో కూడిన బ్లాకుగా ఉంటుంది. సుమారు ఎనిమిది వేల మంది అధికారులు సిబ్బందికి వసతి కల్పించేలా దీనిని రూపొందించారు. ఈ ప్రాజెక్టు మొత్తం నిర్మాణ విస్తీర్ణం 23,25,000 చదరపు అడుగులుగా ఉంటుందని చెబుతున్నారు.

కొత్త కళగానే :

నూతన రాజధాని నగరం అమరావతిలో ప్రతిపాదిత కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతి కోసం దేశంలో అమలులో ఉన్న అత్యున్నత గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రణాళిక చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతిలో ఉద్యోగులు సందర్శకుల అవసరాలను తీర్చడానికి అవసరమైన పౌర సామాజిక సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం పన్నెండు వందల తొంబై తొమ్మిది కోట్లుగా ఉంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రజా పనుల విభాగం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నాయి.