అమరావతికి భారీ ప్రాజెక్టు: సెంట్రల్ సెక్రటేరియెట్ నిర్మాణం
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఇప్పటి వరకు ఎలా స్పందించినా.. గత ఆరేడు మాసాలుగా కేంద్ర ప్రభుత్వం సానుకూలం గానే స్పందిస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jun 2025 8:45 AM ISTఏపీ రాజధాని అమరావతి విషయంలో ఇప్పటి వరకు ఎలా స్పందించినా.. గత ఆరేడు మాసాలుగా కేంద్ర ప్రభుత్వం సానుకూలం గానే స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 1500 కోట్ల మేరకు గ్రాంటుగా విడుదల చేసింది. అదేవిధంగా ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి కూడా సొమ్ములు రుణాల రూపంలో అందించింది. అమరావతికి పెట్టుబడులు వచ్చేలా కూడా ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా ఏఐ యూనివర్సిటీని కూడా అమరావతికి కేటాయించే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉంది.
ఇదిలావుంటే.. తాజాగా కేంద్రం నుంచి అమరావతికి గుడ్ న్యూస్ వచ్చింది. కేవలం న్యూస్ మాత్రమే కాదు.. దీనికి సంబంధించి న అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.దీని ప్రకారం.. అమరావతి విర్మాణంలో మరో మైలురాయి వంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయానికి సెంట్రల్ గవర్నమెంటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 2800 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్రమే ఆయా నిర్మాణాలను అమరావతిలో నిర్మించనుంది. వీటిలో కార్యాలయాలతో పాటు.. ఉద్యోగుల క్వార్టర్స్ కోసం కూడా కొన్ని భవనాలను నిర్మించనుంది. ఈ మేరకు సంబంధిత అంచనాలకు కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది. మొత్తంగా 2800 కోట్ల రూపాయల విలువైన నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజాగా వెలువరించిన ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం గమనార్హం.
జనరల్ పూల్ రెసిడెన్షియల్ కాంప్లక్స్‌ను కూడా కేంద్రమే నిర్మించేందుకు రెడీ అయింది. మొత్తంగా అమరావతి విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం.. రాజధానికి మైలు రాయిగా మారనుంది. ఈ నిర్మాణాలతో అమరావతి ప్రాంతం మరింతగా డెవలప్ అవుతుందనేది నిపుణుల మాట. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవీ అమరావతిలో పెట్టుబడులు పెట్టలేదు. ఒక్క భవనం కూడా నిర్మించలేదు. ఇలాంటి సమయంలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతికి తరలిరావడం.. ఇకపై .. భవిష్యత్తులో అమరావతిని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతుందని అంటున్నారు పరిశీలకులు.
