Begin typing your search above and press return to search.

అమరావతి శాశ్వత రాజధాని...కేంద్రం తీపి కబురు ?

నిజానికి రాజధానికీ రాజకీయాలకు అసలు సంబంధం లేదు కానీ ఏపీలో మాత్రం రాజధాని చుట్టూనే గత పదేళ్ళుగా రాజకీయాలు సాగుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 May 2025 9:15 AM IST
అమరావతి శాశ్వత రాజధాని...కేంద్రం తీపి కబురు ?
X

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని అంతా భావిస్తున్నారు. నిజానికి రాజధానికీ రాజకీయాలకు అసలు సంబంధం లేదు కానీ ఏపీలో మాత్రం రాజధాని చుట్టూనే గత పదేళ్ళుగా రాజకీయాలు సాగుతున్నాయి. దాంతో ఏపీ ప్రజలు కూడా విసిగిపోతున్నారు.

ఒక ప్రభుత్వం ఒక చోట రాజధాని అని నిర్ణయించి కొంత అభివృద్ధి చేస్తే మరో ప్రభుత్వం వచ్చి టోటల్ గా ఆ పాలసీనే వ్యతిరేకించడం మళ్ళీ కొత్త ప్రకటనలు చేయడం ద్వారా కాల హరణం తో పాటు ఏపీ పరువు కూడా ఇబ్బందులో పడుతోందని అంటున్నారు.

ఏపీకి పదకొండేళ్ళు అయినా రాజధాని లేకపోవడం బాధాకరమని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధాని పనులు మళ్ళీ ఊపందుకున్నాయి. ఏకంగా అరవై వేల కోట్ల రూపాయలతో అమరావతి పనులు తిరిగి మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ మే 2న అమరావతి వచ్చి మరీ ఈ పనులకు శ్రీకారం చుట్టారు.

దాంతో అమరావతి దశ తిరుగుతోంది అన్న నమ్మకం అందరిలో ఉంది. అయితే చాలా మందిలో మొలిచిన మరో సందేహం ఏమిటి అంటే మొత్తం పనులు ఎటూ ఈ నాలుగేళ్ళలో పూర్తి కావు, అదే సమయంలో ఏపీలో మరో ప్రభుత్వం వచ్చినట్లు అయితే ఈ పనులు అలాగే కొనసాగుతాయా లేక ఆగిపోతాయా అన్న చర్చ కూడా సాగుతోంది.

నిరంతరంగా అమరావతి పనులు సాగాలీ అంటే కచ్చితంగా రాజముద్ర అమరావతికి అవసరం అన్న భావన అంతటా ఉంది. దాంతో అమరావతినే శాశ్వత రాజధానిగా చేయాలని అంతా కోరుతున్నారు. దీంతో చంద్రబాబు సైతం రాజముద్ర వేయించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.

ఎటూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏపీలోని టీడీపీ ఎంపీల మద్దతుతో ఆగుతోంది. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. దాంతో అమరావతినే ఏపీకి ఏకైక రాజధాని అని గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించాలని కేంద్రం అనుకుంటే అది చిటికలో పని అని అంటున్నారు. ఆ దిశగా అయితే చంద్రబాబు తన వంతు ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నారు.

ఆయన తాజా ఢిల్లీ పర్యటనలో అమరావతిని శాశ్వత రాజధానిగా ఏపీకి ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కోరినట్లుగా తెలుస్తోంది. దానికి కేంద్రం నుంచి కూడా సానుకూలంగా స్పందన వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక ఏపీ పునర్ విభజన చట్టంలో అవసరమైన మార్పులు సవరణలు చేయడం ద్వారా కేంద్రం అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించనుంది అని అంటున్నారు.

వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక మూడు రాజధానులు అని ఎక్కడ అంటుందో అన్నది జనంలో ఉంది. టీడీపీ కూడా అదే అంటోంది దాంతో అమరావతినే ఏకైక రాజధాని చేయాలని ఏపీ వాసులు కోరుతున్నారు తొందరలోనే ఈ విషయంలో కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని అంతా అంటున్నారు అదే కనుక జరిగితే అమరావతి లో ఇటుకను కూడా కదిలించే సాహసం ఎవరూ చేయలేరని అంటున్నారు.