మోడీకి ఆహ్వానం వెనుక.. ఇదీ అసలు సంగతి.. !
ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని ఎందుకు ఆహ్వానించారు..? అనే విషయంపై గురువారం పెద్ద ఎత్తున టీవీల్లో చర్చలు జరిగాయి. ఎవరికి అనుకూలంగా వారు వాదనలు వినిపించారు.
By: Tupaki Desk | 2 May 2025 2:30 PM ISTఏపీ రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభం అవుతున్నాయి. సుమారు ఆరు సంవత్సరాల తర్వాత .. ఈపనులు ప్రారంభం కావడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది. పనులు ప్రారంభించడం.. రాజధానిని పరుగులు పెట్టించడం వరకు.. అందరూ ఆనందిస్తున్న విషయమే అయితే.. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని ఎందుకు ఆహ్వానించారు..? అనే విషయంపై గురువారం పెద్ద ఎత్తున టీవీల్లో చర్చలు జరిగాయి. ఎవరికి అనుకూలంగా వారు వాదనలు వినిపించారు.
సర్కారు తరఫున మాట్లాడిన ప్రతినిధులు.. విపక్ష నేతల విమర్శలపై నిప్పులు చెరిగారు. ఇక, మేదావులు, రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై గంటల తరబడి చర్చలు చేశారు. వాస్తవానికి ఇప్పుడు రెండో సారి అమరావతి పనులకు ప్రారంభం అవుతున్నాయని సర్కారు చెబుతోంది. కానీ, విశ్లేషకులు.. మేధావులు ఇది నాలుగోసారి అని అంటున్నారు. గతంలో రెండు కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు ప్రారంభం చేశారని తెలిపారు.
ఇక, గతంలో జగన్ రాజధాని పనులు నిలిపివేసినప్పుడు.. ప్రశ్నించని ప్రధాని మోడీ..ఇప్పుడు ఎలా వస్తా రన్న చర్చ కూడా తెరమీదికి వచ్చింది. ''నేను శంకు స్థాపన చేసిన రాజధానిని మీరెందుకు ఆపుతున్నా రు'' అని అప్పట్లో జగన్‌ను ఎందుకు ప్రశ్నించలేదన్న సందేహాలు కూడా తెరమీదికి వచ్చాయి. కానీ.. వీటికి సమాధానాలు లేవు. రాజధాని అంశం.. రాష్ట్ర సర్కారు పరిధిలో ఉంటుంది. ఇది రాజ్యాంగం ప్రకా రం కూడా..రాష్ట్రాల జాబితాలోనేఉంది. కాబట్టి.. మోడీ జోక్యం చేసుకోలేదని.. బీజేపీ నాయకులు చెబుతు న్నారు.
కట్ చేస్తే.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీనికి ఆహ్వానించడం వెనుక.. చాలా పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. విశ్వగురుగా పేరు తెచ్చుకున్న మోడీని ఆహ్వానించడం ద్వారా రాష్ట్ర రాజధాని విషయం.. ప్రపంచ వ్యాప్తంగా పోనీ.. దేశవ్యాప్తంగా అయినా.. చర్చకు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపార వేత్తలు.. పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుందని.. అదేసమయంలో రాజధాని పనులు ఆగిపోలేదు.. మున్ముందు జోరుగా సాగుతాయన్న ప్రచారం కల్పించే వ్యూహం ఉందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఇదేసమయంలో రాజధానిలో కేంద్ర పాత్ర ను పెంచడం ద్వారా.. నిధులు తెచ్చుకునేందుకు కూడా అవకాశం ఉంటుందన్న భావన కూడా ఉంది. సో.. అందుకే.. ప్రధాని మోడీని రెండోసారి ఆహ్వానించారని అంటున్నారు.
