Begin typing your search above and press return to search.

అమరావతిలో మెగాస్టార్ స్పెషల్ అట్రాక్షన్.. ప్రధానితో మరోసారి భేటీ?

ప్రధాని మోదీ-మెగాస్టార్ చిరంజీవి మధ్య కొంతకాలంగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి.

By:  Tupaki Desk   |   1 May 2025 5:00 PM IST
అమరావతిలో మెగాస్టార్ స్పెషల్ అట్రాక్షన్.. ప్రధానితో మరోసారి భేటీ?
X

రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి 14 మంది ప్రముఖులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఈ లిస్టులో మాజీ ముఖ్యమంత్రి జగన్ తోపాటు మెగాస్టార్ చిరంజీవి, మరికొందరు కేంద్రమంత్రులు ఉన్నారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను సైతం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. అయితే ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి హాజరుకానుండటం ప్రత్యేక అట్రాక్షన్ గా నిలవనుందని అంటున్నారు.

దాదాపు లక్ష కోట్ల విలువైన రాజధాని పనులకు శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి రానున్న ప్రధాని అక్కడి నుంచి హెలీకాఫ్టర్ లో రాజధాని అమరావతికి వెళ్లనున్నారు. అక్కడ సుమారు గంట 15 నిమిషాల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోదీ హాజరుకానున్న సభకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది జనాలను తరలించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కాగా, అమరావతి పనులు పునఃప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ ఏ హామీ ఇస్తారనేది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సభలో ప్రధాని మోదీ మెగాస్టార్ చిరంజీవితో మరోమారు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రధాని మోదీ-మెగాస్టార్ చిరంజీవి మధ్య కొంతకాలంగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ 3.0 సర్కారు ఏర్పాటుకు జనసేనాని పవన్ కీలకంగా వ్యవహరించారని, ఆయన పట్టుబట్టి కూటమి కట్టమని ఒత్తిడి చేయడం వల్లే ఎన్నికల ముందు టీడీపీతో బీజేపీ చేతులు కలిపిందని గుర్తు చేస్తున్నారు. ఈ పొత్తు సక్సెస్ అవ్వడం వల్లే టీడీపీ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిందని అంటున్నారు. దీంతో ప్రధాని మోదీ జనసేనాని పవన్ అన్నా, ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అన్నా ఎక్కువ విలువ ఇస్తారని చెబుతున్నారు.

గతంలో కూడా ప్రధాని మోదీతో మెగాస్టార్ చిరంజీవి వేదిక పంచుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో భీమవరంలో అల్లూరి శతజయంత్యుత్సవాలు సందర్బంగా ఆయన విగ్రహావిష్కరణకు ప్రధాని రాగా, ఆ వేదికపై మెగాస్టార్ చిరంజీవికి సీటు కేటాయించడం ప్రత్యేకంగా చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు కూడా ప్రధాని పాల్గొనే సభకు ప్రత్యేక అతిథిగా చిరంజీవిని ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ఈ సారి వేదికపై చిరంజీవికి ప్లేసు ఉందా? లేదా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రధాని మోదీ మాత్రం చిరంజీవిపై ప్రత్యేక ఆప్యాయత కనబరుస్తున్నారు. గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు సైతం ప్రధాని మెగా బ్రదర్స్ ను ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా దీపావళి ఉత్సవాలు సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో కూడా చిరుతో ప్రధాని మోదీ స్పెషల్ గా భేటీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో అమరావతి పునఃప్రారంభం సందర్భంగా ఈ ఇద్దరి మధ్య ఎలాంటి భేటీ ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.