చారిత్రక ఘట్టం.. ఎవరూ మిస్ కావొద్దు: చంద్రబాబు
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక క్రతువుకు తొలి అడుగు పడుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలను అలెర్ట్ చేశారు.
By: Garuda Media | 27 March 2026 5:54 PM ISTఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక క్రతువుకు తొలి అడుగు పడుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలను అలెర్ట్ చేశారు. ప్రత్యేకంగా భేటీ అవుతున్న అసెంబ్లీకి ఎవరూ మిస్ కావడానికి వీల్లేదని ఆయన తేల్చి చెప్పారు. తాజాగా పార్టీ నాయకులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని సీఎం స్పష్టం చేశారు. ''ఈ సభకు చాలా ప్రత్యేకత ఉంది. ఇదొక చారిత్రక ఘట్టం. ఎవరూ మిస్ కావొద్దు'' అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
అంతేకాదు.. సభ ప్రారంభానికి ముందుగానే ఎమ్మెల్యేలు సభలో ఉండాలని కూడా చంద్రబాబు చెప్పారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సహా పలువురు సీనియర్ మంత్రులతో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధానికి చట్టబద్ధతకల్పించే విషయంపై వారి వద్ద నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. అమరావతిపై అధ్యయనం చేసి సభకు రావాలని ఆదేశించారు. ప్రతి విషయాన్నీ సభలో ప్రస్తావించాలని సూచించారు.
ఉదయం 11 నుంచి పొద్దు పోయే వరకు కూడా సభ జరుగుతుందని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇది పూర్తిగా అమరావతికి సంబంధించిన అంశమేనని తెలిపారు. రాజధాని ఏర్పాటు, రైతుల త్యాగాలను కూడా స్మరించుకునే సమయమని పేర్కొన్నారు. అదేసమయంలో గత ఐదేళ్లలో వైసీపీ చేసిన విధ్వంసం .. రాజధానిని లేకుండా చేసేందుకు జరిగిన ప్రయత్నాలను కూడా చంద్రబాబు వివరించారు. ఇవన్నీ సభలో అందరూ చర్చించాలని సూచించారు.
తీర్మానంలో కీలక పాయింట్లను చేర్చనున్నట్టు తెలిపారు. దీనిపై అందరూ హోం వర్క్ చేసుకుని సభకు రావాలన్నారు. ఇదిలావుంటే.. ప్రత్యేకంగా అసెంబ్లీని కొలువు తీర్చేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇప్పటి కే నోటిఫికేషన్ విడుదల చేశారు. సభ్యులకు కూడా సభ నుంచి ఇప్పటికే ఆహ్వానం కూడా అందింది. ఈ నేపథ్యంలో సభకు వచ్చే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పలు సూచనలు చేయడం గమనార్హం. దీనిని చారిత్రక ఘట్టంగా ఆయన అభివర్ణించారు.
