ఎకరం రూ.20 కోట్లు.. అమరావతి భూముల విక్రయానికి ప్రభుత్వం సన్నాహాలు!
ఎకరా రూ.20 కోట్లు కనీస ధర నిర్ణయించి సుమారు 4 వేల ఎకరాలు విక్రయించడం ద్వారా రూ.80 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 5 May 2025 4:00 PM ISTరాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం నిధుల వేట ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు రూ.లక్ష కోట్ల రూపాయలతో రాజధాని అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రజలపై ఒక్కపైసా భారం పడకుండా పూర్తిగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతిని ప్రొజెక్టు చేస్తున్నారు. ఇందులో భాగంగా రైతుల నుంచి 34 వేల ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. మరో 20 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని చెబుతున్నారు. దీంతో నిధుల సమీకరణకు సంబంధించి తొలివిడతగా నాలుగు వేల ఎకరాలను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ నెల 2న అమరావతి పనుల పునఃప్రారంభాన్ని ప్రధాని మోదీ చేతులమీదుగా చేపట్టారు. దీనికి దాదాపు రూ.49 వేల కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించారు. అయితే ఈ పనుల కోసం ప్రభుత్వం వద్ద ప్రస్తుతం రూ.31 వేల కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. అదనపు నిధుల సమీకరణతోపాటు ప్రస్తుతం రాష్ట్రం చేసిన కొన్ని అప్పులను తీర్చేందుకు రాజధాని అమరావతి భూములను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది.
ఎకరా రూ.20 కోట్లు కనీస ధర నిర్ణయించి సుమారు 4 వేల ఎకరాలు విక్రయించడం ద్వారా రూ.80 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. 60:40 నిష్పత్తిలో అభివృద్ధి చేసిన భూములను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. అయితే రాజధానిలో ప్రస్తుతం డిమాండును బట్టి అంత ధర చెల్లించి ఎవరు భూములు కొనుగోలు చేస్తారనేది సందేహాస్పదంగా మారింది.
అయితే ప్రతిపక్షాలు మాత్రం అమరావతి భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని విమర్శలు చేస్తున్నాయి. కానీ, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వం వాటాగా వచ్చిన భూములను విక్రయించి, రాజధానిని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం సమర్థించుకుంటుంది. ప్రభుత్వం అంచనా వేసినట్లు ఎకరా రూ.20 కోట్ల చొప్పున భూమి అమ్ముడైతే రాజధాని నిర్మాణానికి కొత్తగా అప్పు చేయాల్సిన అవసరం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వ ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
