అమరావతి విషయంలో కేంద్ర పెద్దల మౌన వ్యూహం ?
ఏపీలో పుష్కర కాలం గడచినా రాజధాని విషయంలో ఒక కొలిక్కి రాని దుస్థితి ఉంది. అమరావతి పేరుతో భారీ స్కేల్ మీద రాజధానిని నిర్మించాలని టీడీపీ ఆరాటపడుతోంది.
By: Satya P | 7 April 2026 10:00 AM ISTఏపీలో పుష్కర కాలం గడచినా రాజధాని విషయంలో ఒక కొలిక్కి రాని దుస్థితి ఉంది. అమరావతి పేరుతో భారీ స్కేల్ మీద రాజధానిని నిర్మించాలని టీడీపీ ఆరాటపడుతోంది. అది తప్పు కాదు కానీ నిధులు ఎక్కడ నుంచి వస్తాయన్న చర్చ బుద్ధి జీవుల నుంచి మేధావులలో ఉంది. ఇక వేలాది ఎకరాలను భూ సేకరణ పేరుతో తీసుకున్నారు మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంది. అమరావతి రాజధాని విషయంలో టీడీపీ పట్టుదలగా ఉంటే మిత్రులతో పాటు ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు టీడీపీకి మద్దతుగా ఉండడం మంచి పరిణామంగానే చూడాలి. ఇక వైసీపీ వ్యతిరేకత రాజకీయాల్లో భాగంగానే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
బీజేపీ పాత్ర ఏంటి :
ఇక ఏపీలోని కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది. అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ ఉంది. అక్కడా ఎన్డీయే ప్రభుత్వం ఉంది ఏపీలో ఎన్డీయే ఉంది. కానీ అమరావతి రాజధాని విషయంలో బీజేపీ పెద్దల పాత్ర ఏమిటి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వారుగా అమరావతికి ఏ విధంగా వారు సాయం భరోసా ఇవ్వాలనుకుంటున్నారు అన్నది అంతా ఆసక్తిగా చూస్తున్నారు అమరావతికి చట్టబద్ధత అంటూ గత కొన్ని రోజులుగా మొదలైన చర్చ చివరికి రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ తో ఒక కొలిక్కి వచ్చింది. గెజిట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఏపీకి అమరావతి రాజధాని అని భారత దేశంలోని మ్యాపులో చూపిస్తారు. ఇక ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ అమరావతి అడ్రస్ మీద సాగుతాయి. అమరావతికి ఒక పిన్ కోడ్ ఇస్తారు అంతా బాగానే ఉంది కానీ అమరావతికి కావాల్సింది ఇంతకంటే చాలా ఎక్కువ అన్నది కేంద్రానికి తెలియదా అన్నదే అందరూ చర్చిస్తున్న విషయం.
ఆర్థిక అండ కోసం :
ఎంత కాదనుకున్నా అమరావతి తొలి దశ పనులకు కచ్చితంగా అరవై నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ప్రపంచ బ్యాంక్ ఆసియన్ బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించామని బీజేపీ పెద్దలు చెప్పుకోవచ్చు కానీ అమరావతికి కావాల్సింది గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని అంతా అంటున్నారు. అలా ఉదారంగా సాయం దక్కాలి. అంతే కాదు అది తిరిగి అప్పుగా కాకుండా ఏపీ కోసం ఇచ్చేట్లుగా ఉండాలి. అది జరిగితేనే అమరావతి ఊపిరి పీల్చుకుంటుంది కానీ ఆ రకమైన భరోసా కానీ కీలక ప్రకటన కానీ కేంద్ర పెద్దల నుంచి అలాగే జాతీయ స్థాయి నేతల నుంచి రావడం లేదని అంటున్నారు.
విభజన చట్టం చూస్తే :
విభజన చట్టంలో కచ్చితంగా చెప్పారు ఏపీ రాజధానిని కేంద్రం నిధులతో నిర్మించాలని. కానీ వాస్తవంగా అలా జరగడం లేదు, అంతే కాదు కేంద్రం నుంచి గ్రాంటులు కూడా లభించడం లేదు, మరి ఏపీ అప్పులతో ఉందని తెలిసి కూడా ఇంత పెద్ద ఆర్థిక భారం పడుతున్నా ఉపేక్షించి ఊరుకోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నదే మేధావుల నుంచి వస్తున్న ప్రశ్న. ఒక వైపు ఏపీ ప్రజలు తన సెంటిమెంట్ గా రాజధానిని చూస్తున్నారు. ఇప్పటికి పుష్కర కాలం క్రితం భూములు ఇచ్చిన రైతులు తమకు మేలు జరుగుతుందని ఎదురుచూస్తున్నారు. అమరావతి అంటే రైతు కూలీలు ఉన్నారు చిన్న వ్యాపారులు ఉన్నారు. రోజు వారీ కూలీలు ఉన్నారు, బీదా బిక్కీ ఉన్నారు, వీరందరి కోసం తొందరగా అమరావతి రాజధాని రూపకల్పన జరగాల్సి ఉంది. మరి దేనికైనా నిధుల సమస్యనే ప్రధానంగా ఉంది. కానీ కేంద్రం నుంచి అయితే పెద్దగా రియాక్షన్ రావడం లేదని అంటున్నారు. ఇది మౌనమా లేక మౌనం వెనక వ్యూహమా అన్నది అయితే అర్ధం కావడం లేదని అంటున్నారు.
