అమరావతి ఇష్యూ - దేశమంతా ఒక్కటైనా.. తెలుగు చిత్ర పరిశ్రమలో చలనం లేదేం?
రాజధాని అమరావతిపై తీవ్ర భావోద్వేగాలు నెలకొన్నాయని అంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తోంది.
By: Satya P | 4 April 2026 12:21 AM ISTరాజధాని అమరావతిపై తెలుగు చిత్ర పరిశ్రమలో మౌనం రాజ్యమేలుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడాన్ని ఆంధ్రులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రభుత్వం కూడా ఈ సందర్బాన్ని చారిత్రక ఘట్టంగా అభివర్ణిస్తూ వేడుకల నిర్వహణకు పిలుపునిచ్చింది. పలువురు ప్రముఖులు అమరావతి విజయాన్ని స్వాగతిస్తూ తమ సోషల్ మీడియాలో కామెంట్లు, ట్వీట్లు చేస్తున్నారు. కానీ, తెలుగు చిత్ర రంగం నుంచి ప్రముఖులు ఎవరూ అమరావతిని ప్రస్తావించకపోవడం, అమరావతి విజయంపై స్పందించకపోవడం చర్చకు తావిస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజధాని అంశంపై చిత్ర పరిశ్రమ మౌనం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
రాజధాని అమరావతిపై తీవ్ర భావోద్వేగాలు నెలకొన్నాయని అంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. అదే సమయంలో దేశంలో అన్ని పార్టీలు కూడా అమరావతికి జైకొట్టాయి. రాష్ట్ర విభజనకు ఉద్యమించిన బీఆర్ఎస్ పార్టీ సైతం అమరావతి బిల్లుకు మద్దతు తెలిపింది. ఏపీలో విపక్ష వైసీపీ తప్ప, దేశంలో మరే పార్టీ కూడా అమరావతిని వ్యతిరేకించలేదు. దీంతో పార్లమెంటులో చేసిన చట్టం అమరావతి సాధించిన భారీ విజయంగా భావిస్తున్నారు.
రాజధాని అమరావతి సాధించిన గుర్తింపుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రాజధాని బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సైతం అభినందనలు తెలుపుతూ సందేశాలు తెలిపారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ బోయపాటి శ్రీను తప్ప మరెవరూ స్పందించలేదు. దీంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులపై విమర్శలు చేస్తూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
రాజధాని అమరావతిలో స్టుడియోల నిర్మాణానికి స్థలాలు కావాలని, సినిమా షూటింగులకు అనుమతి కావాలని, టికెట్ల ధరలు పెంచుకునేందుకు జీవోలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సంప్రదించే సినీ ప్రముఖులు, రాజధాని అమరావతి విషయంలో అలాంటి చొరవ చూపకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినీ రంగానికి ఇద్దరు ప్రముఖ హీరోలు ఏపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నా, సినీ రంగం మాత్రం తమకు రాజధానికి సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం ఏంటని నిలదీస్తున్నారు. ఇదే సమయంలో నంది అవార్డులు ఇవ్వలేదని ఇటీవల ప్రశ్నించిన ప్రముఖ హీరోలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని కూడా ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. నెటిజన్ల నుంచి ఊహించని విధంగా ఎదరవుతున్న ఈ ప్రశ్నలు ఆలోచనకు గురి చేస్తున్నాయి.
