Begin typing your search above and press return to search.

అమరావతిపై రైతుల రివర్స్ గేర్.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ధర్నాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరావతి రూపు రేఖలు మారిపోతున్నాయి.

By:  Tupaki Desk   |   15 April 2025 3:26 PM IST
అమరావతిపై రైతుల రివర్స్ గేర్.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ధర్నాలు
X

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరావతి రూపు రేఖలు మారిపోతున్నాయి. దాదాపు 34 వేల ఎకరాల్లో నూతన రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చురుగ్గా పావులు కదుపుతోంది. దీంతో పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు రాజధాని అమరావతి వచ్చేందుకు పోటీపడుతున్నాయి. దీంతో 34 వేల ఎకరాల్లో నిర్మించాల్సిన రాజధానిని మరో 44 వేల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో రాజధాని కోసం తమ భూములు తీసుకోవాలని ప్రభుత్వంపై రైతులు ఒత్తిడి చేస్తుండటంతో రాజధాని నగరం విస్తరణపై ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది..

ఎక్కడైనా అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల కోసం భూములు ఇవ్వాలంటే రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతుంది. తమ జీవనోపాధి దెబ్బతీస్తారా? అంటూ ప్రశ్నలు ఎదురవుతాయి. కానీ, రాజధాని అమరావతి విషయంలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు రైతులు క్యూకడుతున్నారు. ప్రస్తుతం 34 వేల ఎకరాల్లో నిర్మితమవుతున్న రాజధానిలో భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఏ విధంగా ప్రధాన్యమిస్తుందో గమనించిన రాజధాని చుట్టుపక్కల గ్రామాల రైతులు.. ప్రభుత్వం తమ భూమిని రాజధాని కోసం తీసుకుని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఊహించని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తన ప్రణాళికలను మార్చుకోవాల్సివస్తోందని అంటున్నారు.

ప్రస్తుతం రాజధాని ప్రాంతంగా గుర్తించిన ప్రాంతంలో విమానాశ్రయం లేదు. పక్కనే ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా అప్ గ్రేడ్ చేసి వాడుకోవాలని ప్రభుత్వం ముందు అనుకుంది. ఈ ప్రకారమే 2014-19 మధ్య గన్నవరం విమానాశ్రయం పక్కన రైతుల భూములను తీసుకుని అభివృద్ధి చేసింది. అయితే ఇప్పుడు రాజధాని అమరావతి నగరంలోనే విమానాశ్రయం ఉండాలని అంతర్జాతీయ సంస్థలు సూచిస్తున్నాయి. అమరావతికి ఆనుకుని విమానాశ్రయం ఉంటే మరింత అభివృద్ధి చెందొచ్చని సూచిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం తన ప్రణాళికలు మార్చుకుందని అంటున్నారు. ఇదే సమయంలో రాజధానికి పలు సంస్థలు వస్తుండటంతో రైతుల ప్లాట్లకు డిమాండ్, విలువ పెరిగిపోయింది. కొనుగోళ్లు, అమ్మకాలతో రాజధాని నగరంలో సందడి కనిపిస్తుండటంతో చుట్టుపక్కల రైతులు కూడా తమ భూములను రాజధానికి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే మున్సిపల్ మంత్రి నారాయణను కలుస్తున్న పలువురు రైతులు, రైతు నాయకులు రాజధాని కోసం తమ గ్రామాల్లో భూములు తీసుకోవాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రైతుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా అదనంగా 44 వేల ఎకరాలకు రాజధానిని విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇక రాజధాని పనులు మూడేళ్లలో పూర్తయ్యే చాన్సు ఉండటం, అమరావతిలో భూములకు డిమాండ్ పెరిగిపోవడంతో రుణాలిచ్చేందుకు పలు ఆర్థిక సంస్థలు వరుస కడుతున్నాయి. గతంలో రాజధాని అమరావతి పేరు చెబితేనే ముఖం తిప్పేసిన బ్యాంకర్లు.. తమ బ్యాంకు ద్వారా రుణం తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, జర్మన్ బ్యాంకు, హడ్కో ప్రస్తుతానికి అమరావతికి నిధులు సమకూర్చాయి. ఇప్పుడు ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం అమరావతికి ఫైనాన్స్ చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చించేందు ఆయా బ్యాంకుల ప్రతినిధులు అమరావతికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో రాజధాని అమరావతి దశ తిరిగిందని చెప్పకతప్పదు.