మహా అమరావతికి మరో 20 వేల ఎకరాలు!
మొత్తం 7 అంశాలకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకూ ఆ ఏడు అంశాలు ఏమిటన్నది చూస్తే..
By: Tupaki Desk | 6 July 2025 11:27 AM ISTఏపీ రాజధాని కలను తీర్చేందుకు తపిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అమరావతి పేరుతో రాజధాని నగరాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి పరిధిని విస్తరించటం.. మరింత పెద్దదిగా చేయాలన్న ఆలోచన చేస్తున్న చంద్రబాబు అందుకు తగ్గట్లే.. ముందుగా అనుకున్న దానికి మించి భూసేకరణ చేసేందుకు వీలుగా ఈ మధ్యన సమాలోచనలు చేయటం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి స్పష్టమైన ఆలోచనను.. కార్యాచరణను ప్రకటించారు. అమరావతిలో 20,494 ఎకరాల్ని భూసమీకరణ ప్రక్రియ ద్వారా తీసుకోవాలని డిసైడ్ చేశారు.
ఉండవల్లిలోని సీఎం కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ 50వ సమావేశంలో రాజధానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మొత్తం 7 అంశాలకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకూ ఆ ఏడు అంశాలు ఏమిటన్నది చూస్తే..
1. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కార్లపూడిలేమల్లే గ్రామాలతో పాటు..గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో భూసమీకరణ చేపట్టాలన్న నిర్ణయం.
2. మందడం, రాయపూడి, పిచుకులపాలెంలో ఫైనాన్స్, స్పోర్ట్స్ సిటీలోని దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి వీలుగా పలువురును ఆహ్వానించేందుకు అనుమతులు
3. అమరావతిలో నిర్మించే ఫైవ్‌స్టార్ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సీఆర్‌డీఏ చేసిన ప్రతిపాదనలకు ఓకే చెప్పటం.
4. మందడంలో వివంతా, హిల్టన్ హోటల్స్, తుళ్లూరులో హయత్, లింగాయపాలెం నోవాటెల్ సమీపంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఒక్కొక్కరికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం
5. రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులకు కృష్ణా నది నుంచి ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకునేందుకు అనుమతులు. ప్రస్తుతం అమరావతిలో రూ.49 వేల కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రెండేళ్లలో వివిధ ప్రాజెక్టుల కోసం 160 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం ఇసుక అవసరాల్ని తీరుస్తుంది.
6. రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూకేయింపులకు ఆమోదం. ఇంతకూ ఎవరెవరికి ఎంతెంత అన్నది చూస్తే..
- సీబీఐకు 2 ఎకరాలు
- జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు 2 ఎకరాలు
- స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు 5 ఎకరాలు
- ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు 0.495 ఎకరాలు
- పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 ఎకరాలు
- ఎంఎస్‌కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి 12 ఎకరాలు
- ఆదాయ పన్ను శాఖకు 2 ఎకరాలు
- ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు 2 ఎకరాలు
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.40 ఎకరాలు
- ఎస్‌ఐబీకి 0.50 ఎకరాలు
- కిమ్స్ ఆసుపత్రి, మెడికల్ కాలేజీకి 25 ఎకరాలు
- బీజేపీ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాలు
- బాసిల్ ఉడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు 4 ఎకరాలు
7. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అంబికా గ్రూప్‌లకు గతంలో కేటాయించిన 1.40 ఎకరాలను రద్దు చేస్తూ నిర్ణయం.మంగళగిరి సమీపంలో ఈ-15 రహదారిపై 4 లేన్ల ఆర్‌ఓబీ నిర్మాణానికి ఆమోదం. రాజధాని అమరావతిలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.. అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాల ఏర్పాటుకు ఆదేశాలు.
