అమరావతి మీద మళ్ళీ మొదలైందా ?
ఇపుడు ఆయనకు తోడుగా కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కూడా అమరావతి రాజధాని నచ్చడం లేదు అని డైరెక్ట్ గానే ప్రకటించేశారు.
By: Tupaki Desk | 17 May 2025 8:15 AM ISTఏపీకి రాజధానిగా అమరావతిని డిక్లేర్ చేశారు. కానీ ఆ రాజధానికి ఒక రూపూ షేపూ రావడానికి మాత్రం యుగాలూ జగాలు పడుతోంది. ఏపీలో తలో రకంగా రాజకీయ స్వరాలు వినిపిస్తూ ఉంటారు. దానికి తోడు వివిధ ప్రాంతాలు వాటి మధ్య ఎంతో కొంత వైరుధ్యాలు ఇవన్నీ కలసి ఒక కొత్త రాజధాని విషయంలో అడుగులు వేగంగా ముందుకు పడనీయకుండా చేస్తున్నాయా అన్న చర్చ ఉంది.
అయితే గతమంతా అలా గడిచిపోయింది. మూడు రాజధానులు అంటూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎత్తుకున్న స్లోగన్ 2024 ఎన్నికల్లో బూమరాంగ్ అయింది. ఆ పార్టీకి 11 సీట్లు కట్టబెట్టింది. ఇక అమరావతిని తగ్గించాలని చూసినందుకు కోస్తా జనాలు నమ్మలేదు, విశాఖ రాజధాని అన్నా ఉత్తరాంధ్రులూ పొంగలేదు, రాయలసీమ వాసులూ మనకొక రాజధాని ఉండాలని భావించి అలా చేయకుండా వివాదం చేస్తున్నారని ఆగ్రహించి వైసీపీని ఓడించారు అన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఇక టీడీపీ కూటమికి 2024 ఎన్నికల్లో మంచి మాండేట్ ఇచ్చారు. నూటికి 95 శాతం సీట్లు ఇచ్చారు. దాంతో అధికారంలోకి వచ్చిన కూటమి పెద్దలు అమరావతి మీద ఫోకస్ పెట్టారు. అంతవరకూ బాగానే ఉంది కానీ అమరావతిలోని 33 వేల ఎకరాలను డెవలప్ చేయకుండా మరో 40 వేల ఎకరాలు అవసరం అవుతాయన్నదే ఇపుడు విపక్షాలకు ఆయుధంగా మారుతోంది. 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ చేసిన పొరపాట్లను కూటమి చేయకూడదు అని అంటున్నారు.
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలి. అందులో రెండవ మాట లేదు, వివాదం అంతకంటే లేదు. కానీ అదే సమయంలో ఇతర ప్రాంతాల వాసులకు కన్నెర్ర అయ్యేలా అమరావతి జపం చేయకూడదు, 2014 నుంచి 2019 మధ్యలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసింది ఇదే. దానికి గానూ 2019లో చేదు ఫలితాలు ఆ పార్టీ అందుకుంది. మరి 2024లో ఎక్కువ సీట్లు రాగానే ప్రజా తీర్పుని వేరేగా ఊహించుకోవడమూ తప్పే అని అంటున్నారు.
అమరావతిని వద్దు అని వైసీపీ ఎలా ప్రజల తీర్పుని వేరేగా అర్ధం చేసుకుందో అమరావతి మాత్రమే ముద్దు అని జనాలు అనుకుని తీర్పు ఇచ్చారని భావించడమూ తప్పే అని అంటున్నారు. ఇది ప్రజా తీర్పుని తమను అనుకూలంగా అన్వయించుకోవడమే అంటున్నారు. అందుకే మెల్లగా విపక్షాలు గొంతు సవరిస్తున్నాయి.
వైసీపీ నేతలు అయితే అమరావతి రాజధాని విషయంలో కొంత మౌనం వహిస్తున్నా కొత్తగా ఆ పార్టీలో చేరిన సాకే శైలజానాధ్ మాత్రం అమరావతినే పట్టించుకుని మిగిలిన ప్రాంతాలను వదిలేస్తారా అని సూటి ప్రశ్నలే సంధించారు. ఇపుడు ఆయనకు తోడుగా కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కూడా అమరావతి రాజధాని నచ్చడం లేదు అని డైరెక్ట్ గానే ప్రకటించేశారు. వేల ఎకరాలు ఎందుకు అని కూడా లాజిక్ తో కూడిన ప్రశ్నను సంధించారు.
ఇప్పటికే అమరావతి రాజధాని కోసం అన్ని వేల కోట్లు అప్పులు తేవడమేంటని సీపీఐ ప్రశ్నించింది. ఇలా విపక్షాలు కనుక తమ స్వరాన్ని గట్టిగా వినిపిస్తే జనాల ఆలోచనలలో కూడా మారు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అతి ఉత్సహం తో కాకుండా వాస్తవ పరిస్థితులను గమనంలోకి తీసుకుని కూటమి పెద్దలు అమరావతి రాజధాని విషయంలో అడుగులు వేయడం మంచిది అని అంటున్నారు.
కేవలం అయిదేళ్ళకు మాత్రమే ప్రజలు అధికారం ఇచ్చారు అన్న సంగతిని వారు ఈ సందర్భంగా గమనంలోకి తీసుకోవాలి. పాతిక నుంచి యాభై ఏళ్ళ పై చిలుకు సమయం పట్టే ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే అది ఇబ్బందిగా మారుతుందని గ్రహించాల్సి ఉంది అంటున్నారు. తమ తమ అయిదేళ్ళ టెర్మ్ లో తాము ఏమి చేయగలమో చేసి మరోసారి ప్రజల తీర్పుని కోరాల్సి ఉంటుందని కూడా గ్రహించాలని అంటున్నారు. ఈసారి అమరావతి రాజధాని విషయంలో ఏమైనా జరిగితే మాత్రం దానికి కూటమి పెద్దలే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా గమనంలోకి తీసుకోవాలని అంటున్నారు.
