అమరావతి...వైసీపీ మాట జనాలు వింటారా ?
ఏపీకి అమరావతి రాజధాని అని టీడీపీ 2014లో అధికారం చేపట్టిన తర్వాత నిర్ణయించింది. దానికి నాటి అసెంబ్లీలో ప్రధాని పక్షం వైసీపీ కూడా ఆమోదం తెలిపింది.
By: Tupaki Desk | 5 May 2025 2:00 AM ISTఏపీలో అమరావతి రాజధాని అన్నది ఒక రాజకీయ అంశంగా మారడం బాధాకరం. ఇది ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. గడచిన పాతికేళ్లలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ వంటి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయి. అక్కడ కూడా కొత్తగా రాజధానులు కట్టారు.
కానీ అధికార ప్రతిపక్షాలు కాదు అన్ని పక్షాలు ఏకమై రాష్ట్రం మేలు కోసం పనిచేశాయి. అంతా కలిసి రాజధాని మంచిగా ఉండాలని కోరుకున్నారు. కానీ ఏపీ విషయంలో మాత్రం అందుకు భిన్నం. ఏపీకి రాజధాని లేకుండా విడగొట్టి కేంద్ర పెద్దలు అన్యాయం చేశారు అనుకుంటే ఏపీలోని రాజకీయ పార్టీల మధ్య ఐక్యత లేకపోవడం మరో శాపంగా మారుతోంది అని అంటున్నారు.
ఏపీకి అమరావతి రాజధాని అని టీడీపీ 2014లో అధికారం చేపట్టిన తర్వాత నిర్ణయించింది. దానికి నాటి అసెంబ్లీలో ప్రధాని పక్షం వైసీపీ కూడా ఆమోదం తెలిపింది. అంతే కాదు 2019 ఎన్నికల ముందు కూడా తమ పార్టీ ప్రధాన ఆఫీసుతో పాటు అధినేత నివాసం కూడా అమరావతిలోనే ఉంటుందని చెప్పారు. అలాగే ఎన్నికల ముందు గృహ ప్రవేశం చేశారు.
ఇక ఆ ఎన్నికల్లో గెలిచిన తరువాతనే వైసీపీ మాట మార్చింది అన్న విమర్శలు వచ్చాయి. వైసీపీ అమరావతిని కాదని అనకుండా మూడవ వంతుకు తగ్గిస్తూ మూడు రాజధానుల ప్రతిపాదనను బయటకు తెచ్చారు. అయితే అది విఫలమైన ప్రయోగం అయింది. ఆ దెబ్బతో 151 నుంది 11 సీట్లకు వైసీపీ పడిపోయింది. రాజకీయంగా కోలుకోలేని విధంగా చతికిలపడింది. అంటే ఒక విధంగా అమరావతిని టచ్ చేసి వైసీపీ భారీ రాజకీయ మూల్యం చెల్లించింది అని అంటున్నారు. అయితే వైసీపీ ఓటమి చెందిన తరువాత కూడా అమరావతి మీద తన స్టాండ్ మార్చుకోలేదా అన్న చర్చ సాగుతోంది.
అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులకు తాజాగా మోడీ ప్రధాని హోదాలో శ్రీకారం చుట్టారు. మూడేళ్ళలో అమరావతి రాజధాని పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రజలు కూడా కొత్త రాజధాని శాశ్వత రాజధాని ఏపీకి దక్కుతుందని పూర్తి ఆశావహంగా ఉన్నారు.
ఈ సమయంలో వైసీపీ అమరావతి రాజధాని మీద చేస్తున్న కామెంట్స్ కానీ సందేహాలు కానీ జనాల చెవికి ఎక్కుతాయా అన్న చర్చ అయితే సాగుతోంది. అమరావతి రాజధాని కోసం అప్పులు మొత్తం చేసి ఏపీలో వెనకబడిన ప్రాంతాలు అయిన రాయలసీమ ఉత్తరాంధ్రాలను పూర్తిగా పక్కన పెడుతున్నారని వైసీపీ సీనియర్ నేత సాకే శైలజానాధ్ విమర్శించారు.
అప్పులు తెచ్చి అమరావతి కోసం పెడితే మిగిలిన ప్రాంతాల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. అమరావతికి కృష్ణా నది ముంపు పొంచి ఉందని అంటున్నారు. ఆ భయం ప్రభుత్వానికి లేకపోతే ఏకంగా 1100 కోట్ల రూపాయలను వెచ్చించి అయిదు ఎత్తిపోతల పధకాలను ఎందుకు నిర్మిస్తున్నారు అని ప్రశ్నించారు.
ఆ అయిదు ఎత్తిపోతల పధకాలని నిర్మించకపోతే అమరావతికి రుణాలు ఇవ్వమని కూడా బ్యాంకులు స్పష్టం చేసిన సంగతి నిజం కాదా అంటున్నారు. అలాగే దేశంలో జాతీయ రహదారులను కిలోమీటర్ కి 20 కోట్ల రూపాయలతో నిర్మిస్తూంటే అమరావతిలో మాత్రం ఏకంగా కిలోమీటర్ కి 59 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
ఈ పనులకు ఎలాంటి టెండర్లు లేకుండా నామినేటెడ్ విధానంలో తమకు కావాల్సిన వారికే ప్రభుత్వం కట్టబెడుతోందని ఆయన విమర్శించారు. అమరావతి అంచనా వ్యయాన్ని 44 వేల కోట్ల నుంచి 77 వేల కోట్లకు పెంచేశారు అని ఆయన విమర్శించారు.
ఇలా వైసీపీ చేసిన ఆరోపణలలో అమరావతి పేరుతో దుబారా అవినీతి అక్రమాలు ఉన్నాయని పైగా ఎంచుకున్న ప్రాంతం ముంపు ప్రాంతం అని చాలానే విషయాలు ఉన్నాయి. అయితే ఇవేమీ కొత్తవి కావు అని అంటున్నారు 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీ చేసినవే అని చెబుతున్నారు.
అమరావతి రాజధానికి వైసీపీ వ్యతిరేకమని జనాలకు 2019 నుంచి 2024 మధ్యలో పాలన చూశాక మళ్ళీ నమ్ముతారా అన్నది కూడా చర్చగా వస్తోంది. ఇంకోవైపు చూస్తే ఏపీకి రాజధాని ఒక సెంటిమెంట్ గా మారింది. అమరావతి విషయంలో ఎవరేమి చెప్పినా జనాలు పట్టించుకునే మూడ్ లో లేరని మనకూ ఒక రాజధాని కావాలన్న భావనతో ఉన్నారని అంటున్నారు.
ఈ విధంగా చేయడం వల్ల వైసీపీకి రాజకీయంగా నష్టమే తప్ప మరేమీ ఉండదని అంటున్నారు. వైసీపీ ఎటూ బాహటంగా అమరావతికి మద్దతు ఇవ్వలేదు కాబట్టి సైలెంట్ గా ఉన్నా మేలే అని అంటున్నారు. కానీ ఆ పార్టీ మాత్రం అమరావతి మీద పాత అస్త్రాలనే ప్రయోగిస్తోంది. ఫలితం అయితే కొత్తగా ఏమీ ఉండన్న విశ్లేషణలు ఉన్నాయి.
