అమరావతి బిల్లు.. మరో కీలక పరిణామం! ఇదే ఫైనల్
రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Political Desk | 6 April 2026 7:19 PM ISTరాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన అమరావతి బిల్లును సోమవారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత రాష్ట్రపతి కార్యాలయం బిల్లును ఆమోదిస్తూ ప్రకటన చేయనుంది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా, చట్టబద్ధత లభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు రోజుల క్రితమే రాజ్యసభ ఆమోదించినప్పటికీ వరుస సెలవులు రావడంతో బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపడం ఆలస్యమైందని అంటున్నారు.
అమరావతి ఏపీ శాశ్వత రాజధానిగా పేర్కొంటూ అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. అంతేకాకుండా బిల్లుకు ఎలాంటి సవరణలు చేయకుండా యథాతథంగా ఆమోదించాయి. దీంతో అమరావతి బిల్లును రాష్ట్రపతికి నివేదించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం పెట్టిన తర్వాత అమరావతి బిల్లు చట్టంగా రూపొందనుంది. అంతేకాకుండా 2024 జూన్ నుంచి ఏపీకి అమరావతి రాజధానిగా కేంద్రం అధికారికంగా గుర్తించినట్లు అవుతుందని అంటున్నారు.
అమరావతికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత, రాజధాని హోదా కల్పిస్తూ అధికారిక గెజిట్ విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. ఇది ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా రాజధానికి ప్రత్యేకమైన పిన్ కోడ్ అందుబాటులోకి తెస్తారని కూడా చెబుతున్నారు. అమరావతికి చట్టబద్ధత వచ్చిన తర్వాత రాజధానిలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. సీఆర్డీఏ పరిధిలోని మొత్తం ప్రాంతాన్ని రాజధానిలో అంతర్భాగంగా చూస్తారని వ్యాఖ్యానిస్తున్నారు.
రాజధాని చట్టబద్ధత విషయమై కూటమి ప్రభుత్వం చాలా పట్టుదల ప్రదర్శిస్తోంది. ఇప్పటికే 21 నెలల ఆలస్యమైందని, వెంటనే బిల్లును సభలో ప్రవేశపెట్టి ఏపీ పునర్విభజన చట్టాన్ని సవరించాలని కూటమి పార్టీలు చాలాకాలంగా కేంద్రంలో అధికార బీజేపీపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతోనే కేంద్ర ప్రభుత్వం కూడా బిల్లు విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని రాజధానికి రాష్ట్రపతి నుంచి ఆమోదముద్ర వేయించాలని ప్రయత్నిస్తోందని అంటున్నారు.
దేశంలోని దాదాపు 40 పార్టీల పార్లమెంటు సభ్యులు అమరావతి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇటు లోక్ సభ, అటు రాజ్యసభలో అన్నిపార్టీల వారు అమరావతికి అనుకూలమన్న ప్రకటనలే చేశారు. అదే సమయంలో ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం బిల్లును వ్యతిరేకించింది. ఉభయ సభల నుంచి ఆ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. కానీ, మిగిలిన అన్నిపక్షాలు అమరావతికి ఆమోదం తెలుపుతూ ఏపీ పునర్విభజన చట్టానికి అనుకూలంగా ఓటేయడంతో అమరావతి ఇక నుంచి చట్టబద్ధమైన రాజధానిగా రూపాంతరం చెందనుందని వ్యాఖ్యానిస్తున్నారు.
