Begin typing your search above and press return to search.

కీలక పరిణామం.. అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది.

By:  Tupaki Political Desk   |   1 April 2026 4:36 PM IST
కీలక పరిణామం.. అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం
X

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. బుధవారం ఈ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టగా, వైసీపీ మినహా దేశంలోని ఉన్న 40 పార్టీలు ఆమోదం తెలిపాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సభలో ఉదయం 12 గంటల సమయంలో బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చర్చను ప్రారంభించారు. ఈ చర్చలో మొత్తం 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు మాట్లాడారు.

ఏపీ పునర్విభజన చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ, రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లును మెజార్టీ పార్టీలు ఆమోదించాయి. అధికార కూటమిలోని బీజేపీ, శివసేన, టీడీపీ, జనతాదళ్ పార్టీలతోపాటు విపక్షంలోని కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలు కూడా బిల్లును సమర్థిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే విపక్షానికి చెందిన కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు చర్చలో పాల్గొని విభజన హామీలు నెరవేర్చాలని కోరారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మినహా సభలో బిల్లుపై మాట్లాడిన ఎంపీలు అందరూ సమర్థిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాత్రం అమరావతికి మాత్రం తాము వ్యతిరేకం కాదని చెబుతూనే బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అమరావతి బిల్లుకు లోక్ సభ ఆమోదం లభించడంతో గురువారం రాజ్యసభలో ముందుకు రానుంది. అమరావతి విషయంలో దాదాపు అన్ని పార్టీలు సముఖంగా ఉండటంతో రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందడం ఖాయమంటున్నారు. కాగా, బిల్లుపై దాదాపు 18 మంది ఎంపీలు మాట్లాడగా, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తోపాటు తెలుగు రాష్ట్రానికి చెందిన ఎంపీలు గడ్డం వంశీ కృష్ణ, బాలశౌరి మాతృభాష తెలుగులోనే మాట్లాడారు.

ముందుగా మాట్లాడిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అమరావతి రాజధానికి చారిత్రక నేపథ్యం ఉందని, సంస్కృతిక వైభవంతో విరాజిల్లిందని గుర్తు చేశారు. 60 రోజుల్లో 29 వేల మంది రైతుల నుంచి భూ సమీకరణ చేశామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మి రైతులు తమ జీవనాధారం వదులుకుని భూములు ఇచ్చారని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్ అమరావతికి మద్దతు ఇచ్చారని, సీఎం అయ్యాక మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులను హేళన చేశారని, వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి పెమ్మసాని ప్రారంభించిన చర్చను బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కొనసాగించారు. రాజధాని అమరావతి చట్టబద్దతకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ, రాజధాని అమరావతి బిల్లుపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అమరావతిని తాము వ్యతిరేకించడం లేదని, కానీ రైతులకు న్యాయం చేయని బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మిథున్ రెడ్డి తర్వాత మాట్లాడిన కాంగ్రెస్, సమాజ్ వాది, శివసేన ఎంపీలు కూడా బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. లోక్ సభలో ఒక్క వైసీపీ తప్పా, మిగిలిన అన్ని పార్టీలు బిల్లుకు అనుకూలంగా ఉండటంతో ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ చర్చ తీవ్ర ఉత్కంఠ రేపింది.