రాజ్యసభకు లోకేష్.. కీలక చర్చ ప్రత్యక్ష వీక్షణం!
ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ నేరుగా రాజ్యసభలో జరిగే చర్చను వీక్షించనున్నారు.
By: Garuda Media | 2 April 2026 8:45 AM ISTఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. అయితే.. మరో కీలక క్రతువు .. మిగిలి ఉంది. అదే రాజ్యసభ. పెద్దల సభలోనూ ఈబిల్లు ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. అయితే.. లోక్‌సభలో మాదిరిగా రాజ్యసభలో అధికార పక్షానికి(ఎన్డీయే) బలం తక్కువగా ఉంది. వైసీపీకి ఎక్కువగా సభ్యులు ఉన్నారు. దీంతో ఇక్కడ వాద ప్రతివాదాలు ఎక్కువగానే జరగనున్నాయి.దీంతో రాజ్యసభలో జరిగే చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ నేరుగా రాజ్యసభలో జరిగే చర్చను వీక్షించనున్నారు. ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకు న్నారు. రాజ్యసభ గ్యాలరీ నుంచి అమరావతిపై జరిగేచర్చను వీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఢిల్లీ వెళ్లి.. గురువారం ఉదయం రాజ్యసభకు హాజరవుతారు. ఇదేసమయంలో కేంద్ర మంత్రులు... పలువురు బీజేపీ సీనియర్లను కూడా ఆయన కలుసుకుంటారు. తమకు సహకరించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలపనున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీలు సైతం.. లోక్‌సభలో కలిసి రావడం పట్ల కూటమి ప్రభుత్వం సంతోషిస్తోంది.
పెద్దల సభలో..
పెద్దల సభలో కూటమి సర్కారుకు బలం లేదు. దీంతో ఈబిల్లుపై ఏం జరుగుతుందన్న చర్చ ఉంది. అయితే.. కీలకమైన కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు లోక్‌సభలోనే ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాజ్యసభలో కూడా ఈ బిల్లుపై చర్చనల్లేరుపై నడకే అవుతుందని అంటున్నారు. ఎందుకంటే.. ఇప్పటికే కాంగ్రెస్ సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. అంతేకాదు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలోనూ పెద్దగా ఎలాంటి అడ్డంకులు ఉండే అవకాశం లేదు.
అయితే.. వైసీపీకి బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చర్చను సాగదీసేందుకు లేదా వాయిదా వేసేందుకు ప్రశ్నల రూపంలో ఇబ్బంది పెట్టేందుకు.. అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం పెద్దల సభలోనూ ఇబ్బందులు రాకుండా.. టీడీపీ, బీజేపీ ఎంపీలు పలువురితో చర్చిస్తున్నట్టు తెలిసింది. మొత్తంగా రాజ్యసభలోనూ ఈ బిల్లు ఆమోదం పొందితే.. వెంటనే రెండు రోజుల్లోనే రాష్ట్రపతి దీనిని నోటిఫై చేసి.. గెజిట్ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది.
