Begin typing your search above and press return to search.

అమరావతి రాజధానిని ఫ్రీ జోన్ గా ప్రకటిస్తారా ?

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంది. ఇది ఇపుడు సుస్పష్టమైంది. అమరావతి రాజధాని విషయంలో ఎవరికీ ఏ విధమైన పేచీ పూచీలు లేవు.

By:  Tupaki Desk   |   11 Jun 2025 2:30 PM
అమరావతి రాజధానిని ఫ్రీ జోన్ గా ప్రకటిస్తారా ?
X

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంది. ఇది ఇపుడు సుస్పష్టమైంది. అమరావతి రాజధాని విషయంలో ఎవరికీ ఏ విధమైన పేచీ పూచీలు లేవు. ఏపీకి మంచి రాజధాని కావాలని అయిదు కోట్ల ప్రజానీకం బలంగా కోరుకుంటున్నారు. అయితే అమరావతి రాజధానిని అంతా సమర్ధిస్తూనే మరో వైపు ఏపీలో ఉన్న ఇతర నగరాలు టైర్ టూ సిటీలను అభివృద్ధి చేయాలని వికేంద్రీకరించాలని సూచిస్తున్నారు.

తెలంగాణాకు కానీ దేశంలో చాలా రాష్ట్రాలకు కానీ లేని సదుపాయం ఏపీకి మాత్రమే ఉందని గుర్తు చేస్తున్నారు. ఏపీలో పది లక్షలు దాటిన జనాభాతో మెట్రో సిటీలుగా విశాఖ, విజయవాడ ఉన్నాయి. అలాగే పది లక్షల లోపు జనాభాతో కాకినాడ, తిరుపతి, రాజమండ్రి వంటి నగరాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు ఇక అయిదు లక్షల జనాభా కలిగిన నగరాలు కూడా ఏపీలో మరో పది దాకా ఉన్నాయని వీటిని అన్నింటినీ అభివృద్ధి చేస్తే కనుక ఏపీలో ఏకంగా అమరావతి రాజధానితో పాటు మరో పదిహేను నగరాలు కూడా జత కలిసి గ్రోత్ ఇంజన్లు అనేకం వస్తాయని అంటున్నారు.

ఇక ఏపీలో నాలుగు జోన్లను ఏర్పాటు చేశారు. అవి ఉత్తరాంద్రా, కృష్ణా ఉభయ గోదావరి, ఇక గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఒక జోన్ గా, రాయలసీమ నాలుగు జిల్లాలూ మరో జోన్ గా విభజించారు అయితే అమరావతి జోన్ త్రీలో ఉంది. దాంతో అమరావతి అభ్హివృద్ధి ఫలాలు ఏపీలో మొత్తం పదమూడు ఉమ్మడి జిల్లాలకూ అందాలంటే కనుక ఫ్రీ జోన్ గా ప్రకటించాలని కోరుతున్నారు. అంటే అమరావతి రాజధానిలో విద్యా ఉపాధి అవకాశాలకు ఏపీలో మొత్తం జనాభా అంతా పోటీ పడేలాగానూ వాటిని అందుకునేలాగానూ ఈ అవకాశం ఇవ్వాలని అంటున్నారు.

లేకపోతే మిగిలిన ప్రాంతాలు వివక్షకు గురి అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు దీని మీద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసీ రెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా చేస్తేనే ఏపీలో మొత్తం యువతకు ఉపాధి విద్య అవకాశాలకు మంచి చాన్స్ ఉంటుందని అన్నారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ రాజధానిని ఫ్రీ జోన్ గా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.

అమరావతి విషయంలో కూడా కూటమి ప్రభుతం ఈ తరహాలో నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మరి దీనిని కూటమి ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందో చూడాల్సి ఉంది. రానున్న కాలంలో అమరావతి మీద పూర్తి ఫోకస్ ఉంటుంది. అంతే కాదు అక్కడే పరిశ్రమలు వస్తాయి, విద్యా సంస్థలు పెద్ద ఎత్తున వస్తాయి, అందువల్ల ఫ్రీ జోన్ పెడితే ఎవరైనా లబ్ది పొందుతారు అన్నదే మేధావుల సూచనలుగా ఉన్నాయి.