అమరావతికి రాజయోగం...కేంద్రం సిద్ధం
ఆయన తాజాగా అమరావతికి భూములు ఇచ్చిన రైతులతో సమావేశం నిర్వహించినపుడు ఈ కీలక విషయం వెల్లడించారు.
By: Satya P | 23 Nov 2025 9:07 AM ISTఏపీకి రాజధాని ఏదీ అంటే 2024 తర్వాత నుంచి ఎవరూ ఈ జవాబు కోసం తడుముకోవడం లేదు. అమరావతి కదా అని చాలా ధీమాగా సింపుల్ గా ఆన్సర్ ఇస్తున్నారు. ఆ నిబ్బరం కలిగించింది చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే డే వన్ నుంచి అమరావతి మీదనే పూర్తి దృష్టి పెట్టి మరీ బాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే ఎక్కడో ఆగిన అమరావతి రాజధాని రైలుని సూపర్ స్పీడ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ గా మార్చేసింది అని భావించాలి.
ఆ లోటు అలాగే :
అయితే ఎవరెంత చెప్పినా ఎన్ని చేసినా కొన్ని కార్యక్రమాలు శంఖంలో పోస్తేనే కానీ తీర్ధం కావు. అలాగే అమరావతి రాజధాని అన్నది జనాంతికమైన మాటగా ఎంతగా ప్రాచుర్యం పొందినా అధికార లాంచనాలు కచ్చితంగా పూర్తి చేసుకోవాలి. లేకపోతే ప్రోటోకాల్స్ కానీ ఇతరత్రా అధికారిక వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు ఎదురవుతాయి. అన్నింటికీ మించి రాజకీయంగా కూడా జరిగిన నష్టాలు కష్టాలు కూడా 2019 నుంచి 2024 మధ్యలో అంతా చూశారు. సో అమరావతి మన రాజధాని అని ఒక గెజిట్ నోటిఫికేషన్ కనుక దేశ అత్యున్నత పార్లమెంట్ వేదికగా కనుక ఆమోదించి రాజ ముద్ర వేస్తే ఆ మీదట ఏ రాజకీయ గాలులు వీచినా కూడా అమరావతి చెక్కు చెదరదు అని అంటున్నారు.
ముహూర్తం అపుడే :
ఇక అమరావతి రాజధానికి అధికారికంగా ప్రకటించే గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ ఇపుడు చివరి దశకు చేరుకుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పడం విశేషం. ఆయన తాజాగా అమరావతికి భూములు ఇచ్చిన రైతులతో సమావేశం నిర్వహించినపుడు ఈ కీలక విషయం వెల్లడించారు. అమరావతికి ముందున్నవి అన్నీ మంచి రోజులే అని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. అంతే కాదు డిసెంబర్ లో జరిగే శీతాకాల పార్లమెంటు సమావేశాలలోనే అమరావతి బిల్లుని కేంద్రం ప్రవేశపెడుతుందని ఆయన ఎప్పారు ఈ బిల్లుని ఆమోదించడంతో ఈ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. దాంతో అమరావతి రాజధాని పేరిట ఇక రాజకీయంగా ఎవరు ఏ రకమైన నాటకాలకు తెర తీయాలనుకున్న వీలు చిక్కని ఉక్కు బంధం పెనవేసుకుంటుంది అన్న మాట.
కేరాఫ్ అమరావతి :
అధికారికంగా నోటిఫై చేస్తూ పార్లమెంట్ ఉభయ సభలు బిల్లుని ఆమోదిస్తే దాని మీద రాష్ట్రపతి రాజ ముద్ర పడుతుంది. ఆ మీదట ఏపీ రాజధాని అన్నది కేంద్ర గెజిట్ లో ప్రచురితం అవుతుంది. కేంద్రం జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ కూడా కేరాఫ్ అమరావతిగానే వస్తూంటాయి. కేంద్రం రాజధానుల కోసం అందించే ఏ రకమైన సదుపాయాలు కానీ ప్రాజెక్టులు కానీ నేరుగా అక్కడికే వస్తాయి. అంతే కాదు పెట్టుబడులు పెట్టాలనుకునే వారు సైతం ధీమగా ఉండొచ్చు. ఈ రాజధానికి రాజ ముద్ర ఉంది. ఇక ఎక్కడికీ పోదు అన్న నమ్మకంతో వారు పెట్టుబడులు పెట్టవచ్చు. ఆ విధంగా పారిశ్రామిక స్థిరత్వంతో పాటు అభివృద్ధికి కూడా బాటలు పడతాయని అంటున్నారు.
