Begin typing your search above and press return to search.

అమరావతి లేటెస్ట్ అప్డేట్ వారికి అసూయ పుట్టిస్తుందా ?

ఏపీలో అమరావతి రాజధాని గురించి గత ఏడాది కాలంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంతో శ్రద్ధ కనబరుస్తోంది.

By:  Tupaki Desk   |   16 Jun 2025 2:30 AM
అమరావతి లేటెస్ట్ అప్డేట్ వారికి అసూయ పుట్టిస్తుందా ?
X

ఏపీలో అమరావతి రాజధాని గురించి గత ఏడాది కాలంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంతో శ్రద్ధ కనబరుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టడానికి డే వన్ నుంచి తన వంతుగా ప్రయత్నాలు చేయడమే కాదు కేంద్ర సాయం తీసుకుంది. అక్కడ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి, ప్రపంచ బ్యాంక్ ఆసియన్ బ్యాంక్ సహా అనేక బ్యాంకులు నిధులు ఇచ్చాయి. దాంతో పెద్ద ఎత్తున నిధులు సమకూరుతున్నాయి.

అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఒక కొలిక్కి తెస్తున్న కూటమి ప్రభుత్వం మరో రెండేళ్లలో దానిని పూర్తి చేస్తామని అంటోంది. అమరావతి రాజధాని పనులను చూస్తున్న మంత్రి నారాయణ అయితే మరో రెండేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని కొత్త అప్డేట్ ఇచ్చారు. ఇది నిజంగా షాకింగ్ అప్డేట్ అనే చెప్పాలి.

అమరావతి నిర్మాణం రెండేళ్లలో పూర్తి అవుతుంది అంటే అది ఎంతో శుభ పరిణామం అదే సమయంలో రాజధాని లేదు అన్న బాధలో ఉన్న ఆంధ్రులకు అమరావతి ఒక రూపూ షేపునకు వస్తే అంతకంటే వేరేగా కావాల్సింది ఏదీ లేదు అని అంటున్నారు. ఇక అమరావతి విషయంలో అన్ని రకాలైన చర్యలు తీసుకున్నామని ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని నారాయణ చెప్పారు.

ఏకంగా యాభై వేల కోట్ల రూపాయల విలువైన పనులకు అమరావతి రాజధానిలో టెండర్లు పిలిచామని తాజాగా నారాయణ చెప్పారు. అంతే కాదు ఈ నిర్మాణం పనులు కూడా వేగంగా సాగుతున్నాయన్నారు. దేశంలో ఆధునిక రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు ఇచ్చారన్నారు. దేశంలోని వివిధ నగరాలను పరిశీలించి ప్రత్యేక ప్రణాళికతో అమరావతిలో మౌలిక సదుపాయాలు వసతులను కల్పిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.

మరో వైపు చూస్తే అమరావతి రాజధాని కోసం ముప్పయి వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్ వైసీపీ అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని మంత్రి నారాయణ మండిపడ్డారు. అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండడంతో దాన్ని తట్టుకోలేని వైసీపీ నేతలు దుష్ప్రచారానికి దిగుతున్నారన్నారు. ఇదంతా అసూయతో చేస్తున్నవే అని అన్నారు.

అయితే ప్రభుత్వం మాత్రం అమరావతి రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దే విషయంలో కృత నిశ్చయంతో ఉందని నారాయణ చెప్పారు. అందరూ గర్వించేలా ఒక బ్రహ్మాండమైన రాజధానిగా అమరావతి రాజధాని తయారు అవుతుందని ఆయన ధీమాగా చెప్పారు. అమరావతి అంటే వైసీపీకి అసూయ అన్న మాటలు మాత్రం ఇపుడు వైరల్ అవుతున్నాయి.