మే రెండో తేదీన రెండోసారి అమరావతికి ప్రధాని మోదీ
అమరావతి 2.0 పనుల ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. మే 2న రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.
By: Tupaki Desk | 15 April 2025 4:18 PM ISTఅమరావతి 2.0 పనుల ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. మే 2న రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే టెండర్లు ఖరారైన పనులకు పీఎం మోదీ శంకుస్థాపన చేస్తారని, మూడేళ్లలోగా రాజధానిలోని కొత్త అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఎప్పుడెప్పుడు మొదలవుతాయా? అని ఎదురుచూస్తున్న అమరావతి పునర్నిర్మాణ పనులకు ముహూర్తం ఫిక్స్ అయింది. మే నెల 2వ తేదీన ప్రధాని మోదీ పర్యటించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఆ రోజు ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుంది. 2015 అక్టోబరులోనే రాజధానిలో తొలిసారిగా పర్యటించిన ప్రధాని మోదీ అమరావతి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత 2019 వరకు పనులు నిరాటంకంగా పనులు కొనసాగాయి. అప్పట్లోనే ప్రస్తుత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలను నిర్మించారు. రికార్డు సమయంలో వీటిని పూర్తి చేసి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ప్రభుత్వం అమరావతికి తరలివచ్చింది.
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులకు బ్రేక్ పడింది. ఐదేళ్లపాటు ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోవడంతో అమరావతి ఓ చిట్టడివిలా మారిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిలో పెరిగిపోయిన ముళ్లకంపులు, పిచ్చిమొక్కలను తొలగించారు. దాదాపు 31 వేల కోట్ల నిధులు సేకరించి పనుల పునఃప్రారంభానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రపంచ బ్యాంకుతోపాటు ఇతర ఆర్థిక సంస్థలు కేంద్ర ప్రభుత్వం అండదండలతో ప్రజా రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేంకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఇక ఆగిన చోటే తిరిగి ప్రారంభించాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం.. ప్రధాని మోదీని రెండోసారి అమరావతికి ఆహ్వానించి ఆయన చేతులమీదుగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ వినతి మేరకు ప్రధాని మోదీ కూడా ఓకే అనడంతో మే 2న మోదీ పర్యటన ఖరారైంది.