Begin typing your search above and press return to search.

కమ్మ కులస్తులకు సారీ... కండిషన్స్ అప్లై!

ఈ సమయంలో కమ్మ సామాజికవర్గంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఆమంచి కృష్ణమోహన్ క్షమాపణలు చెప్పారు. దీనికి

By:  Tupaki Desk   |   14 Aug 2023 3:57 AM GMT
కమ్మ కులస్తులకు సారీ... కండిషన్స్  అప్లై!
X

కులాలనూ, రాజకీయాలనూ వేరుచేసి చూడలేమని అంటుంటారు. మరిముఖ్యంగా ఏపీ వంటి రాష్ట్రాల్లో మరీ కష్టమని చెబుతుంటారు! ఈ క్రమంలో తాజాగా ప్రకాశం జిల్లాలో వైసీపీ సీనియర్ నేత ఆమంచి కృష్ణమోహన్ కమ్మ కులాన్ని టార్గెట్ చేసుకున్నారు. కాస్త గట్టిగానే మాట్లాడారనే కామెంట్లు వినిపించాయి. అయితే తాజాగా ఆయన సారీ చెప్పారు.

అవును... కమ్మ కులంపై ఆమంచి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో... ఈ వ్యాఖ్యలపై ఈ సామాజిక వర్గీయులు మండిపడుతున్నారు. ఈ సమయంలో కమ్మ సామాజికవర్గంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఆమంచి కృష్ణమోహన్ క్షమాపణలు చెప్పారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో స్పందించిన ఆమంచి... వేటపాలెం ఘటనలో తాను చేసిన వ్యాఖ్యలు కమ్మ సామాజికవర్గంలో కుల రహితంగా బతికేవారిని, తన శ్రేయోభిలాషును, స్నేహితులను బాధించాయని, ఈ నేపథ్యంలో అందరినీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు.

ఇదే సమయంలో కమ్మ సామాజికవర్గంపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. మరోపక్క... ఘటనకు కారణమైన వ్యక్తులకు మాత్రం తన క్షమాపణలు వర్తించవని స్పష్టం చేశారు ఆమంచి.

చీరాల వైసీపీలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోన్న సంగతి తెలిసిందే. ఇటీవల వేటపాలెం పరిధిలోని రామన్నపేట పంచాయితీ 6, 10 వార్డులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ఒక వర్గీయులు నామినేషన్లు వేయడానికి ప్రయత్నించగా ఒకేపార్టీలోని మరో వర్గీయులు అడ్డుకున్నారు!

దీంతో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం తనయుడు వెంకటేష్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వివాదం పెద్దదయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు ఇరువైపులా శాంతింపచేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆమంచి వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చాయి. తాజాగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి క్షమాపణలు చెబుతూ... కండిషన్స్ అప్లై అన్నారు!