Begin typing your search above and press return to search.

లీకులపై లీకులు: ఆమంచి వారి దారెటు.. !

చీరాల మాజీ ఎమ్మెల్యే కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహ‌న్‌పై అనేక వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

By:  Garuda Media   |   20 April 2026 9:00 PM IST
లీకులపై లీకులు: ఆమంచి వారి దారెటు.. !
X

చీరాల మాజీ ఎమ్మెల్యే కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహ‌న్‌పై అనేక వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. వీటిలో నిజం ఎంత‌నేది మాత్రం అధికారికంగా ఎవ‌రికీ తెలియ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీలో ఉన్న ఆమంచి.. తన‌కు చీరాల‌ టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో అలిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త‌న పుట్టింటికి వ‌చ్చిన‌ట్టు ఉంద‌ని అప్ప‌ట్లో ఆయ‌న కామెంట్లు చేశారు. కానీ, ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీని ఆయ‌న వ‌దిలేశారు.

వాస్త‌వానికి ఆయ‌నే పార్టీని వ‌దిలేశారో.. లేక ష‌ర్మిలే ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డంలేదో తెలియాల్సి ఉంది. కానీ.. ఏడాది కిందట చీరాల‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ష‌ర్మిల ప‌క్క‌న మెరిసిన ఆమంచి త‌ర్వాత‌.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక‌, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న జ‌న‌సేన వైపు చూస్తున్నార‌ని ఒక ప్ర‌చారం ఊపందుకుంది. అదేస‌మ‌యంలో టీడీపీ వైపు ఆయ‌న అడుగులు ప‌డుతున్నాయ‌ని మ‌రికొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు.

ఈ రెండు కూడా లీకులేన‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల మ‌ధ్య అయితే.. ఉంటున్నార‌న్న‌ది వాస్త‌వం. త‌ర‌చుగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. కానీ, ఎలాంటి జెండా లేకుండానే.. ఒంట‌రిగానే.. త‌న అనుచరుల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఏ పార్టీపైనా.. ఏ నాయ‌కుడిపైనా ఆమంచి కామెం ట్లు చేయ‌డం లేదు. దీంతో అటు వైసీపీలోకి వెళ్తారా? లేక .. టీడీపీలోకి వ‌స్తారా? అనేది ఆస‌క్తిగా మారింది. దీనిలో వైసీపీ వైపు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

టీడీపీలో ఇప్పుడు ప‌రిస్థితి మారింది. చంద్ర‌బాబు మాదిరిగా చూసీ చూడ‌న‌ట్టు పోవాల‌ని మంత్రి లోకేష్ భావించ‌డం లేదు. పార్టీకి అన్యాయం చేశార‌ని.. లేదా.. పార్టీని విమ‌ర్శించార‌ని ఆయ‌న భావిస్తున్న నాయ‌కుల‌ను ప‌క్క‌న పెడుతున్నారు. యూత్‌ను పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నారు. దీంతో ఆమంచి వంటి వారికి అవ‌కాశం ఇచ్చే విష‌యంలో లోకేష్ ఎట్టి ప‌రిస్థితిలోనూ గ్రీన్ ఫ్లాగ్ చూపించే అవ‌కాశం లేదు. పైగా.. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండ‌య్య యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ప‌రిణామాల‌తో ఆమంచి ప్ర‌యాణం ఎటు ? అన్న‌ది ఆస‌క్తిగా మారింది.