Begin typing your search above and press return to search.

ఆమంచి చేరేది ఆ పార్టీ గూటికేనా ?

దాంతో ఆయనకు తాజాగా వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలు కలసి వస్తున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   13 July 2025 4:00 PM IST
ఆమంచి చేరేది ఆ పార్టీ గూటికేనా ?
X

ప్రకాశం జిల్లాలో ఆమంచి క్రిష్ణ మోహన్ ఒక కీలక నేతగా ఉన్నారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత మాజీ సీఎం రోశయ్య శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమంచి క్రిష్ణ మోహన్ బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. కాంగ్రెస్ తో సుదీర్ఘకాలం అనుబంధం ఆయనకు ఉంది. మధ్యలో తెలుగుదేశం, వైసీపీలలో కూడా ఆయన రాజకీయం చేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు.

షర్మిల పీసీసీ చీఫ్ అయిన తరువాత కాంగ్రెస్ లో చేరిన ఏకైన బలమైన నేత ఎవరైనా ఏపీలో ఉన్నారు అంటే అది ఆమంచి క్రిష్ణ మోహనే అని చెప్పాలి. అంతే కాదు 2024లో పోటీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో అత్యధిక ఓట్లు తెచ్చుకున్నదీ ఆయనే కావడం విశేషం. రీసెంట్ గా షర్మిల జిల్లా పర్యటనలో భాగంగా ఒంగోలులో కార్యకర్తల సభ పెడితే దానిని బాగా నిర్వహించిది కూడా క్రిష్ణ మోహనే.

కాంగ్రెస్ లో బలమైన నేతగా ఉన్న క్రిష్ణ మోహన్ వచ్చే ఎన్నికల కోసం తీవ్రంగానే ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేయరు అని అంతా అంటున్నారు. 2024లో అయితే వైసీపీ నుంచి బయటకు వచ్చి అప్పటికే కిటకిటలాడుతున్న కూటమి వైపు వెళ్ళలేక ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు అని అంటారు.

ఇక ఆయన ఇపుడు తన భవిష్యత్తు రాజకీయం గురించి ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. టీడీపీలో చేరేందుకు అవకాశం లేదని అంటున్నారు. దానికి కారణం చీరాల నియోజకవర్గాన్ని ఆయన కోరుకుంటారు. అక్కడ ఆ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఇక జనసేనలో చేరవచ్చు కానీ పొత్తులో చీరాల టీడీపీకే పోతుంది అని అంటున్నారు.

దాంతో ఆయనకు తాజాగా వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలు కలసి వస్తున్నాయని అంటున్నారు. చీరాల నుంచి కరణం వెంకటేష్ ని తప్పించి అద్దంకికి వైఎస్ జగన్ షిఫ్ట్ చేశారు. అద్దంకి కూడా కరణం ఫ్యామిలీకి బలమైన స్థావరం. పైగా 2024లో కరణం ఫ్యామిలీకి చీరాల టికెట్ ఇస్తే ఓటమి పాలు అయ్యారు. దాని వల్ల ఆమంచి కృష్ణమోహన్ కూడా పార్టీకి దూరం అయ్యారని పార్టీ భావిస్తోంది.

ఇపుడు చీరాల వైసీపీ ఖాళీగా ఉంది. బలమైన నాయకుడు ఆ పార్టీకి కావాలని అంటున్నారు. అదే సమయంలో ఆమంచికి కూడా బలమైన పార్టీ వచ్చే ఎన్నికల కోసం కావాలని అంటున్నారు. జగన్ మీద ఆమంచికి కోపం లేదని అలాగే ఆమంచికి కూడా జగన్ విషయంలో ఏమీ ఫిర్యాదులు లేవని అంటున్నారు. దాంతో రెండు వైపుల నుంచి అవసరాలు ఆమంచిని తిరిగి వైసీపీ గూటి వైపుగా నడిపిస్తాయని అంటున్నారు.

దీని కోసం సరైన ముహూర్తమే కుదరాలని అంటున్నారు. బహుశా లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ముందు ఆమంచి క్రిష్ణ మోహన్ తిరిగి ఫ్యాన్ పార్టీ నీడకు చేరుకోవచ్చు అని జిల్లాలో ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.