రెంటికీ చెడ్డ రేవడులు.. ఏం చేస్తున్నారు ..!
పార్టీలు మారడం.. రాజకీయ నేతల లక్షణంగా మారిపోయిన ఈ రోజుల్లో.. ఎవరు ఏ పార్టీలో ఉన్నారన్నది.. అప్పటికి వారు కప్పుకొన్న జెండాలను బట్టి.. అనుసరించే విధానాలను బట్టి.. నిర్ణయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
By: Tupaki Desk | 24 April 2025 4:00 PM ISTపార్టీలు మారడం.. రాజకీయ నేతల లక్షణంగా మారిపోయిన ఈ రోజుల్లో.. ఎవరు ఏ పార్టీలో ఉన్నారన్నది.. అప్పటికి వారు కప్పుకొన్న జెండాలను బట్టి.. అనుసరించే విధానాలను బట్టి.. నిర్ణయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి చాలా మంది నాయకులు అలవాటు పడ్డారు. ఇలా చేసుకుని కొందరు మంత్రులుగా చలామణి అవుతున్నారు. మరికొందరు ఎటూ కాకుండా కూర్చుకుంటున్నారు. ఇలాంటివారిలో ప్రముఖం గా వినిపిస్తున్న పేరు ఆమంచి కృష్ణమోహన్ సోదరులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల, గిద్దలూరు నియోజకవర్గాలు సహా.. కొన్ని చోట్ల ఆమంచి బ్రదర్స్‌కు మంచి పేరుంది. ఇది వారిని గత ఎన్నికల వరకు కాపాడింది. 2014లో ఇండిపెండెంటుగా స్వతంత్ర పార్టీ పేరుతో పోటీ చేసినా.. ఆమంచిని విజయం దక్కించుకునే దిశగా అడుగులు వేయించింది. కానీ, 2019కి వచ్చే సరికి ఆయన పార్టీ మారారు. వైసీపీ పంచన చేరారు. కానీ, ప్రజలు అంగీకరించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు వైసీపీకి ఇచ్చిన ప్రజలే ఆమంచికి మాత్రం చోటు పెట్టలేదు.
ఇక, గత ఎన్నికల్లోనూ.. ఆమంచికి వైసీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన బయటకు వచ్చారు. కాంగ్రెస్ పంచన చేరారు. కానీ, అక్కడ కూడా ఫలితం దక్కలేదు. అసలు ఏమీ లేని కాంగ్రెస్‌లో చేరి.. ఏదో సాధించాలని సొంత హవాతో అయినా.. గెలుపు గుర్రం ఎక్కుదామని భావించినా.. ఆయన పాచిక పారలేదు. ఆయన సోదరుడు స్వాములు(శ్రీనివాసులు) పరిస్థితి కూడా అలానే తయారైంది. ఈయన వైసీపీని కాదని.. జనసేనలోకి వెళ్లారు. కోరుకున్న టికెట్ ఇవ్వలేదన్న బాధతో బయటకు వచ్చారు.
ఇప్పుడు ఈ ఇద్దరు సోదరుల పరిస్థితి అడకత్తెరలో ఉన్నట్టు వారి అనుచరులు చెబుతున్నారు. ఎటూ వెళ్ల లేని పరిస్థితి. అలాగని రాజకీయాలను వదిలేయలేని పరిస్థితి ఇద్దరు సోదరులను వెంటాడుతోంది. వెళ్లా లని అనుకుంటే.. వైసీపీ అవకాశం ఇస్తుంది. కానీ, అక్కడ చెప్పినట్టు వినాలన్న షరతు వెంటాడుతోంది. ఇది నచ్చకే బయటకు వచ్చారు. ఇప్పుడు మరోసారి వెళ్లి చేతులు కాల్చుకునే పరిస్థితి లేదు. పోనీ.. కాంగ్రెస్‌లోనే ఉందామంటే.. అసలు ఈ పార్టీ మరింత దిగజారిందన్న చర్చ ఉంది. సో.. మొత్తానికి ఆమంచి సోదరుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయిందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది.
