అల్లూరి విగ్రహం పార్లమెంట్ లో ఎపుడు ?
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గట్టిగా ఇరవై ఏడేళ్ళు మాత్రమే బతికారు. ఆయన గిరి జనంలో చైతన్యం తీసుకుని వచ్చారు.
By: Tupaki Desk | 5 July 2025 3:52 AMవిప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గట్టిగా ఇరవై ఏడేళ్ళు మాత్రమే బతికారు. ఆయన గిరి జనంలో చైతన్యం తీసుకుని వచ్చారు. మూడేళ్ళ పాటు ఆయన గిరిజనంతో కలసి ఆంగ్లేయులను ముప్పతిప్పలు పెట్టారు. ఆయన చేసినవి వీరోచిత పోరాటాలే. రాజుగా పుట్టి రారాజుగా వెలుగొందాల్సిన ఆయన తనకు ఆ జీవితం వద్దు అనుకుని పేదల కోసం కష్టపడ్డారు. దేశమాత దాస్య శృంఖలాలను బద్ధలు కొట్టడం కోసం తన జీవితాన్నే అర్పించారు.
అల్లూరి సాయుధ పోరాటాన్నే నమ్ముకున్నారు. ఆసేతు హిమాచలం తిరిగారు. భారతదేశంలో ఎక్కడ చూసినా బ్రిటిష్ వారి అఘాయిత్యాలు ఆగడాలే ఆయనకు కళ్ళ ముందు కనిపించాయి. దాంతో ఆయన వాటిని తట్టుకోలేకపోయారు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే ఆయన సుభాష్ చంద్రబోస్ కంటే ముందే సాయుధ బాట పట్టారు.
అప్పటికి దేశంలో జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటం తీరు తెన్నులను కూడా గమనించారు. ఈ విధంగా చేస్తే యుగాలూ జగాలు పడుతుందని తేల్చుకోవాల్సిందే అని ఆయుధం పట్టారు. ముల్లుకు ముల్లు కత్తికి కత్తి అన్నదే ఆయన విధానం అయింది. ఇక అల్లూరి తండ్రి గారిది పశ్చిమ గోదావరి జిల్లా. చిన్నతనంలో తండ్రి మరణించారు.
ఇక తల్లిగారిది విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రగి అనే చిన్న గ్రామం. అక్కడే ఆయన 1897 జూలై 4న జన్మించారు. మేనమాలల దగ్గర పెరిగారు. ఆయన విశాఖ ఏవీఎన్ కాలేజిలో కొంతకాలం చదివారు. ఆ తరువాత ఆయన అడవుల బాట పట్టారు. ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేవారు.
అలా ఏజెన్సీ ప్రాంతంలో ఆయన తపస్సు చేసుకునేటపుడు ఆనాటి బ్రిటిష్ సిబ్బంది గిరిజనుల చేత గొడ్డు చాకిరీ చేయించుకుంటూ వారికి సరైన వేతనం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వైనాన్ని గమనించారు. తన కర్తవ్యం జీవిత లక్ష్యం ఆయనకు గుర్తుకు వచ్చింది. గిరిజనులకు మద్దతుగా బ్రిటిష్ మూకల మీద తిరగబడ్డారు జరుగుతున్న అన్యాయం గురించి వారికి చెప్పి అవగాహన కల్పించారు. అలా బలమైన సైన్యంగా వారినే మార్చుకుని అద్భుతమైన పోరటమే చేశారు.
అలా అల్లూరి బ్రిటిష్ వారిని గడగడలాడించారు. 1924లో ఆయన బ్రిటిష్ వారికి పట్టుబడ్డారు. ఒక చెట్టుకు కట్టేసి వారు ఆయనను కాల్చి ఒక విప్లవయోధుడిని పొట్టన పెట్టుకున్నారు. అయితే ఈ రోజుకీ ఆయన గురుతులు నర్శీపట్నం పాడేరు పరిసరాలలో కనిపిస్తాయి. రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ మీద 1922 ప్రాంతంలో అల్లూరి చేసిన దాడిని ఈ రోజుకీ తలచుకుంటారు.
ఇదిలా ఉంటే అల్లూరి జయంతిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్శీపట్నంలో ఘనంగా జరిపించారు. అల్లూరి పార్క్ కి ఈ సందర్భంగా శ్రీకారం చుట్టారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పది లక్షల రూపాయలను ఎంపీ ల్యాండ్స్ నుంచి కేటాయించడం విశేషం.
మరో వైపు అల్లూరు పుట్టిన పాండ్రంగిలోనూ ఉత్సవాలు జరిగాయి. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అల్లూరి నడయాడిన ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్ గా మారుస్తామని ప్రకటించారు.
విశాఖలో ఎల్లెడలా అల్లూరి జయంతి వేడుకలు ఉత్సాహంగా సాగాయి. అయితే ఈ సందర్భంగా ఒకే మాట వినిపించింది. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ లో ఎందుకు పెట్టరు అని. అల్లూరి వంటి మహనీయుని గురించి దేశానికి తెలియాలని ఆయన జయంతి వర్ధంతులను జాతీయ స్థాయిలో నిర్వహించాలని కోరుతున్నారు. 2002లోనే అల్లూరి విగ్రహం పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయడానికి అనుమతులు వచ్చాయని చెబుతున్నారు. అయితే ఈ రోజుదాకా ప్రభుత్వాలు ఆయన విగ్రహం స్థాపించే విషయంలో అలసత్వం చూపిస్తున్నాయని విమర్శిస్తున్నారు. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ లో ఏర్పాటు చేయడమే అసలైన నివాళి అని అంటున్నారు. మరి ఆ రోజు ఎపుడు వస్తుందో అని అల్లూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.
