Begin typing your search above and press return to search.

సర్వేలన్నీ జగన్ వైపు...ఫెయిల్యూర్ అక్కడే...!?

ఏపీలో ఏ సర్వే చూసినా అత్యధికం వైసీపీ వైపు ఉంటున్నాయి. దానికి కారణం ఏంటి అన్నది కనుక చూస్తే చాలా విషయాలు కనిపిస్తాయి.

By:  Tupaki Desk   |   29 Dec 2023 7:30 AM GMT
సర్వేలన్నీ జగన్ వైపు...ఫెయిల్యూర్ అక్కడే...!?
X

ఏపీలో ఏ సర్వే చూసినా అత్యధికం వైసీపీ వైపు ఉంటున్నాయి. దానికి కారణం ఏంటి అన్నది కనుక చూస్తే చాలా విషయాలు కనిపిస్తాయి. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది ఆ పార్టీకి ప్రచారం అన్నది పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ వైపు అందరి చూపూ ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ ఆ పార్టీ గురించే మాట్లాడుకుంటారు.

అందువల్ల ఎపుడూ జనం నోళ్లలో వైసీపీ నానుతుంది. ఇక వైసీపీ మరి కొద్ది నెలలలో అయిదేళ్ల పాలనను పూర్తి చేసుకోబోతోంది. మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. సహజంగా అయిదేళ్ళ పాలించిన ఏ పార్టీకైనా యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. అది వైసీపీకి కూడా ఎంతో కొంత ఉండక తప్పదు.

మరి దాన్ని క్యాచ్ చేసే విషయంలో విపక్షాలు ఉన్నాయా అన్నదే ప్రశ్న. అయితే ఏపీలో విపక్షాలు అధికార పార్టీ మీద పోరాటం చేస్తున్నాయి. కానీ విడతల వారీగానే ఉంటోంది. కంటిన్యూస్ గా అయితే లేదు. తెలంగాణాలో అయితే ప్రతీ రోజూ యుద్ధమే అన్నట్లుగా రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ తో తలపడేవారు.

కానీ ఏపీలో మాత్రం అలాంటి వాతావరణం లేదు. ఒక సభ నిర్వహించిన తరువాత కొన్నాళు గ్యాప్. మళ్లీ మరో సభ నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఏపీలో ప్రతిపక్ష నేతలు ఉండడంలేదు. వారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు నాన్ లోకల్స్ అన్న వైసీపీ చేస్తున్న ప్రచారం కూడా జనాల్లోకి వెళ్తోంది.

ఏ ఇష్యూని అయినా పట్టుకుంటే దాన్ని పరిష్కరించేంతతవరకూ పోరాటం చేయాలి. కానీ ఏపీలో ఆ వాతావరణం అయితే లేదు. దాంతో పాటు వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది, కానీ అది టీడీపీకి కానీ ఇతర పక్షాలకు కానీ ఎందుకు కన్వర్ట్ అవాలి అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే గత ప్రభుత్వం ఎవరితో కాదు టీడీపీది. ఆ బ్యాగేజ్ ని మోస్తూ టీడీపీ ఇపుడు జనంలోకి వస్తోంది.

నాడు చేసిన కార్యక్రమాలు ఆగినవి అన్నీ ఇపుడు చర్చకు వస్తున్నాయి. రాజధాని అని తీసుకున్నా పోలవరం అన్నా లేక మరో కార్యక్రమం అయినా ప్రత్యేక హోదా అయినా ఏదైనా కూడా టీడీపీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. దాని నుంచే ఈ ప్రభుత్వానికి అవి బదలాయించబడ్డాయి. దాంతో ఆ విషయాలను ప్రస్తావించి వైసీపీ మీద బురద జల్లాలనుకున్నా వర్కౌట్ కావడం లేదు సరికదా అవన్నీ మీ టైం లో ఉన్నవే కదా అని జనాలు అనుకునే పరిస్థితి.

ఇక ఏపీలో అప్పులు అన్నది పెద్ద సబ్జెక్టే. కానీ అది కూడా విభజన ఏపీలో చిన్నది అవుతోంది. కారణం టీడీపీ అప్పులు చేసింది. వైసీపీ చేసింది, ఎక్కువ తక్కువలు తేడాలు అంతే. ఇక విభజన తరువాత ఏపీకి ఆదాయం లేదు అన్నది అందరికీ తెలుసు. దాంతో రాష్ట్రం సర్వ నాశనం అయింది జగనే బాధ్యుడు అన్న టీడీపీ విమర్శలు కూడా ఇక్కడ ఫెయిల్ అవుతున్నాయి. నిజానికి చూస్తే ఏపీలో కోట్లాది జనాలు ఉమ్మడి ఏపీ విభజనగా మారిన తరువాతనే రాష్ట్రం నాశనం అయింది అని అనుకుంటున్నారు. అంటే విభజనే ఏపీ నాశనానికి కారణం అన్నది భావనగా ఉంది.

ఈ విధంగా చూసినపుడు అయిదేళ్ళ వైసీపీ పాలన మీద విపక్షాలు చేసే విమర్శలకు కూడా అర్ధాలు ఉండడంలేదు అంటున్నారు. జగన్ సంక్షేమ పధకాల మీద కూడా మొదట్లో విమర్శలు చేసి తరువాత మేమూ అమలు చేస్తామని చెప్పడం ద్వారా కూడా ఇండైరెక్ట్ గా విపక్షం ఆ పధకాలు బాగున్నాయి అని ఒప్పుకున్నట్లు అవుతోంది. ఇంకో వైపు చూస్తే నిర్మాణాత్మక విమర్శలు అన్నవి ప్రతిపక్షం నుంచి లేవు.

పది పనులలో ప్రభుత్వం చేసినవి రెండు బాగున్నాయి అని అన్నా లేక మౌనంగా ఉన్నా ఫరవాలేదు, అలా కాకుండా అన్నీ బాలేవు అని అనడం వల్లనే విపక్షం విమర్శలకు పదును లేకుండా పోతోంది అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో రాజకీయ ప్రత్యర్ధులు లేరు, శత్రువులే అన్న భావన కూడా జనంలోకి వెళ్ళిపోయింది.

ఈ ముఖ్యమంత్రిని నేను పేరు పెట్టి పిలుస్తాను అని ఒక పార్టీ నేత అంటారు. సీఎం ని సైకో అని ఇంకొకరు అంటారు. ఇలా విమర్శలు నేల బారుడుగా ఉండడం వ్యక్తిగతంగా ఉండడం ఇదంతా వారి గోల తప్ప ఇందులో ప్రజల అంశాలు సమస్యలు లేవు అన్న భావన కూడా నానాటికీ బలపడుతోంది అంటున్నారు.

అన్నింటికీ మించి విపక్షం తన వీక్ నెస్ ని చెప్పేసుకుంటోంది. మేము ఒంటరిగా రాలేమని పొత్తులకు వెళ్తోంది. దాని వల్ల కూడా వైసీపీ బలంగా ఉంది అన్న భావనను జనాలకు వారే చెబుతున్నారు. ఇక ఏపీలో చూస్తే

సామాజిక సమీకరణలు కూడా కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. అర్బన్ సెక్షన్ కొన్ని ఉన్నత వర్గాలలో వ్యతిరేకత ఉంది. ఆ ఓటు బ్యాంక్ మీద అధికార పార్టీకి నమ్మకం లేదు. ఆ ఓటు బ్యాంక్ వచ్చినా విపక్షానికి అధికారం దక్కుతుందో లేదో చెప్పలేని స్థితి.

ఈ నేపధ్యంలో వస్తున్న సర్వేలలో మెజారిటీ వైసీపీ వైపే మొగ్గు చూపడానికి కారణం ఆల్టర్నేషన్ పాలిటిక్స్ గట్టిగా లేకపోవడమే అంటుననరు. దాంతో ఏదో సాగుతోంది కదా అని ప్రస్తుత పాలన మీద చివరకు జనాలు ఓకే అంటున్న నేపధ్యం ఉంది. మొత్తానికి వైసీపీకి అనుకూలంగా సర్వేలు అంటే ఆ పార్టీ పట్ల పాజిటివిటీ ఉంది, అదే టైం లో విపక్షం ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయని అంటున్నారు.