Begin typing your search above and press return to search.

స్టేట్‌మెంట్ల మంత్రులు... లాభ‌మెంత ..!

కూట‌మి ప్ర‌భుత్వంలోని మంత్రుల తీరు ఒక్కొక్క‌రిదీ ఒక్కొక్క‌రకంగా ఉంది. కొంద‌రు ప‌నులు చేస్తూ.. సీఎం చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మార్కుల కోసం వేచి చూస్తున్నారు.

By:  Garuda Media   |   29 July 2025 8:00 PM IST
స్టేట్‌మెంట్ల మంత్రులు... లాభ‌మెంత ..!
X

కూట‌మి ప్ర‌భుత్వంలోని మంత్రుల తీరు ఒక్కొక్క‌రిదీ ఒక్కొక్క‌రకంగా ఉంది. కొంద‌రు ప‌నులు చేస్తూ.. సీఎం చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మార్కుల కోసం వేచి చూస్తున్నారు. మ‌రికొంద‌రు ప్రెస్ ముందుకు వ‌చ్చి స్టేట్ మెంట్లు ఇచ్చి.. మెప్పుకోసం చూస్తున్నారు. ప‌నులు చేస్తున్న‌వారిని గుర్తించ‌డం వ‌ర‌కు బాగానే ఉంది..కానీ, ఇలా మీడియా ముందుకు వ‌చ్చి స్టేట్‌మెంట్లు ఇవ్వ‌డం వ‌ల్ల‌.. వైసీపీపై నిప్పులు చెర‌గ‌డం వ‌ల్ల వారికి వ్య‌క్తిగ‌తంగా గ్రాఫ్ పెర‌గ‌క‌పోగా.. త‌గ్గుతోంది. ఈ విష‌యాన్ని మంత్రులు గ్ర‌హించాల్సి ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌.. ప‌ని ఎలా ఉన్నా.. మీడియా ముందు.. వైసీపీని తిట్టిపోయ‌డం లో మాత్రం ముందున్నారు. సీఎం చంద్ర‌బాబు చెప్పారు క‌దా.. అన్న‌ట్టుగా ఆమె వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ.. చంద్ర‌బాబు చెప్పింది.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నుల‌కు, గ‌త వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ప‌నుల‌కు పోలిక పెట్టి.. వాటిని.. ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని. ఈ విష‌యాన్ని మంత్రి అనిత అర్ధం చేసుకోవడంలో ఎక్క‌డో త‌డ‌బ‌డిన‌ట్టుగా ఉన్నారు. దీంతో ఆమె.. నోటికి మాత్ర‌మే ప‌నిచెబుతున్నారు. పైగా.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న వాటిని ఆమె అస‌లు సీరియ‌స్‌గా తీసుకోవడంలోనూ వెనుక బ‌డుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

మంత్రి సుభాష్‌: ఈయ‌న పరిస్థితి కూడా ఇలానే ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సుభాష్‌.. ఆ శాఖ‌లో ఏం జ‌రుగుతోందో.. కార్మికుల క‌ష్ట న‌ష్టాలు ఏంటో.. ప్ర‌భుత్వం వీరికి అందిస్తున్న ప‌థకాలు ఏమిటో కూడా తెలియ‌డం లేదు. కేవ‌లం వైసీపీపై విమ‌ర్శ‌లు చేయ‌డం వ‌రకే ప‌రిమితం అవుతున్నారు. ఇటీవ‌ల ఈయ‌నే కొంద‌రు మీడియా మిత్రుల‌ను స‌ల‌హాలు ఇవ్వాల‌ని కోర‌డం.. టీడీపీలో చ‌ర్చ‌కు దారితీసింది. మంత్రిగా ఆయ‌న దూకుడుగా ఉండ‌డం త‌ప్పుకాదు. కానీ, ప్ర‌జ‌ల మధ్య‌కు వెళ్ల‌డంలో మైన‌స్ అవుతున్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌పైనా ప‌ట్టు తెచ్చుకోలేక పోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

మంత్రి ఆనం: ఈయ‌న ప‌నితీరు మ‌రో ర‌కంగా ఉంది. త‌న‌కు రెవెన్యూ లేదా.. ఆర్థిక శాఖ‌లు ఇచ్చి ఉంటే బాగుండేద‌ని కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో వ్యాఖ్యానించారు. ఇది జ‌రిగి చాలా రోజులే అయింది. అయితే.. ఇచ్చిన శాఖ‌కు న్యాయం చేస్తే.. ఇత‌ర శాఖ‌లు కోర‌వ‌చ్చు. కానీ.. దేవ‌దాయ శాఖ‌లో ఆయ‌న ముద్ర ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా.. ఈశాఖ‌లో ఉన్న‌తాధికారులే పెత్త‌నం చేస్తున్నారు.

పెద్ద ఎత్తున అవినీతి జ‌రుగుతున్న శాఖ కూడా ఇదేన‌న్న చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లోనూ ఉంది. స‌హ‌జంగా ఇత‌ర శాఖ‌ల‌పై ఉండే ఈ ముద్ర దేవ‌దాయ శాఖ‌పై ప‌డ‌డం వెనుక మంత్రి ప‌నిచేయ‌క‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు. ఇలా.. మ‌రికొంద‌రు కూడా ఉన్నారు. వారంతా ప‌నితీరు మార్చుకోక‌పోతే.. చంద్ర‌బాబు ఎంత క‌ష్ట‌ప‌డినా.. ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.