Begin typing your search above and press return to search.

మళ్లీ వైసీపీ గూటికి ఆ ఎమ్మెల్యే!

అయితే గత పదేళ్లుగా మంగళగిరిలో ఎమ్యెల్యేగా ఆర్కేనే ఉండటం, వైసీపీ క్యాడర్‌ అంతా ఇప్పటì కీ ఆయనతోనే ఉండటం వంటి వాటితో జగన్‌ పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   20 Feb 2024 4:40 AM GMT
మళ్లీ వైసీపీ గూటికి ఆ ఎమ్మెల్యే!
X

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మళ్లీ వైసీపీ గూటికి వెళ్లనున్నట్టు టాక్‌ నడుస్తోంది. 2014, 2019ల్లో వైసీపీ తరఫున మంగళగిరి నుంచి ఆయన గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపైన 12 ఓట్ల తేడాతో గెలుపొందిన ఆర్కే 2019లో నారా లోకేశ్‌ పై 5,300 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి టీడీపీ ప్రభుత్వంపైన ఆర్కే హైకోర్టులో, సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు.

కాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆర్కేకు వైసీపీ అధినేత జగన్‌ సీటు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్కే.. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. మంగళగిరి సీటును టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన చేనేత సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవికి జగన్‌ కేటాయించారు.

అయితే గత పదేళ్లుగా మంగళగిరిలో ఎమ్యెల్యేగా ఆర్కేనే ఉండటం, వైసీపీ క్యాడర్‌ అంతా ఇప్పటì కీ ఆయనతోనే ఉండటం వంటి వాటితో జగన్‌ పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. చంద్రబాబు, రాజధాని భూముల అంశంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ఆర్కేకు అన్యాయం జరిగిందనే మాట రాకుండా జగన్‌ చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.

దీంతో ఆర్కేతో చర్చించాలని వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలను జగన్‌ ఆదేశించినట్టు సమాచారం.

మరోవైపు ఇప్పటికే గంజి చిరంజీవిని మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించినా ఆయన అభ్యర్థిత్వంపై వైసీపీ క్యాడర్‌ సంతృప్తిగా లేరని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైసీపీలో ఉన్న మంగళగిరి మాజీ ఎమ్మెల్యేలు కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావుల్లో ఒకరికి టికెట్‌ ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం ఏడు విడతల్లో జగన్‌ అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో మళ్లీ కొన్ని స్థానాల్లో మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో కూడా మార్పు ఉంటుందని అంటున్నారు. గంజి చిరంజీవి స్థానంలో కాండ్రు కమల లేదా మురుగుడు హనుమంతరావుల్లో ఒకరు అభ్యర్థి కావచ్చని పేర్కొంటున్నారు. లేదా ఆర్కేతో చర్చలు ఫలిస్తే మూడోసారి కూడా ఆయనే వైసీపీ అభ్యర్థి అయినా ఆశ్చర్యం లేదంటున్నారు.

ఆర్కే సన్నిహితులు కూడా మళ్లీ వైసీపీలోకి వెళ్లాలని ఆయనకు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీసీ అధిష్టానం ముఖ్య నేతల ద్వారా ఆయనతో చర్చించడానికి ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం. ఈ వారంలోనే ఆర్కే రాకపై నిర్ణయం ఉండొచ్చని అంటున్నారు.