Begin typing your search above and press return to search.

మే నెలలో భీమవరం గ్రంధి సంచలనం ?

భీమవరం అన్నది హాటెస్ట్ పొలిటీకల్ సీటు అన్నది తెలిసిందే. 2019లో పవన్ కళ్యాణ్ అక్కడ నుంచే పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

By:  Tupaki Desk   |   14 April 2025 4:00 AM
Grandhi Srinivas Poised for a Political Reboot
X

భీమవరం అన్నది హాటెస్ట్ పొలిటీకల్ సీటు అన్నది తెలిసిందే. 2019లో పవన్ కళ్యాణ్ అక్కడ నుంచే పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. దాంతో ఆ అసెంబ్లీ నియోజకవర్గం టాక్ ఆఫ్ ద ఏపీ అయింది. ఇక 2024లో కూడా పవన్ అక్కడ నుంచే పోటీకి దిగుతారు అని అంతా చివరి నిముషం దాకా అనుకున్నారు.

కానీ పవన్ పిఠాపురం ఎంచుకున్నారు. ఇదిలా ఉంటే భీమవరం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు గెలిచిన వారు గ్రంధి శ్రీనివాస్. ఆయన మొదట కాంగ్రెస్ వాది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేయాలనుకున్నా టికెట్ దక్కలేదు. దాంతో ఆయన 2011లో వైసీపీలో చేరారు.

అలాగే 2014లో వైసీపీ నుంచి పోటీ చేసినా గెలుపు వరించలేదు. 2019లో మాత్రం ఆయన గెలిచి సత్తా చాటారు. 2024లో ఆయన ఓటమి చెందారు. ఇలా నాలుగు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు గెలిచారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో గెలిచాక గ్రంధి శ్రీనివాస్ కి మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. పవన్ మీద గెలవడం అంటే జెయింట్ కిల్లర్ గా అంతా చెప్పుకున్నారు. దాంతో ఆయనకు కచ్చితంగా కేబినెట్ బెర్త్ ఖరారు అవుతుందని లెక్కలేశారు. కానీ అలా జరగలేదు.

జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే ఆయనకు విస్తరణలో సైతం పదవి దక్కలేదని ఆయన వర్గం గట్టిగా నమ్మింది. ఇక 2024 ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారుతారని వార్తలు వచ్చాయి. అలాగే ఆయనకు కీలక పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని కూడా చెప్పుకున్నారు. కానీ గ్రంధి శ్రీనివాస్ మాత్రం వైసీపీకే కట్టుబడి పోటీ చేశారు. అలా ఆయన పోటీ చేసినా కూటమి ప్రభజనం ముందు తట్టుకోలేకపోయారు. దాంతో పరాజయం పలకరించింది.

ఈ నేపథ్యంలో ఓటమి తరువాత కొన్నాళ్ళ పాటు మౌనంగా ఉన్న గ్రంధి శ్రీనివాస్ వైసీపీని వీడుతున్నట్లుగా ఒక ప్రకటన చేసారు. ఆ వెంటనే ఆయన టీడీపీలోకో లేక జనసేనలోకో వెళ్తారని అంతా భావించారు. కానీ అవేమీ జరగలేదు. నెలలు గడచిపోతున్నా గ్రంధి రాజకీయం ఏమిటో తెలియడం లేదు

అయితే ఆయన మౌనంగా అన్నీ గమనిస్తున్నారని తొందర పడటం లేదని అంటున్నారు. భీమవరంలో చూస్తే జనసేన నుంచి ఎమ్మెల్యేగా పులపర్తి రామాంజనేయులు ఉన్నారు. దాంతో టీడీపీ వైపు నాయకత్వం లేమి ఉందని అంటున్నారు. అయితే ఆయన టీడీపీలో చేరితే ఎంతమేరకు రాజకీయ లాభం భవిష్యత్తు ఏమిటి అన్నది కూడా ఆలోచిస్తున్నారని అంటున్నారు.

ఇంకోవైపు చూస్తే ఆయన తిరిగి వైసీపీలోకి వస్తారని ప్రచారం కూడా ఉందిట. కూటమిలో చేరినా అక్కడ రాజకీయాలలో ఇమడడం కష్టమన్న ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. ఇలా అనేక రకాలైన ఆలోచనలతోనే గ్రంధి శ్రీనివాస్ తన రాజకీయ ప్రకటనను ఆపుకుంటున్నారని చెబుతున్నారు.

అయితే ఆయన మే నెలలో సంచలన ప్రకటన చేస్తారు అని ఇపుడు అంటున్నారు. ఆయన ఏ పార్టీలో చేరేదీ మే నెలలోనే వెల్లడిస్తారని అంటున్నారు. అంగబలం అర్ధబలం కలిగి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎదిగిన నేతగా తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంక్ ని కలిగిన నాయకుడిగా ఉన్న గ్రంధి అంటే అన్ని పార్టీలూ గౌరవిస్తాయి. ఆయన రాకను అంతా కోరుకుంటున్నారు. అయితే తాను వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అన్నది గ్రంధి ఆలోచించుకునే సరైన నిర్ణయం తీసుకుంటారు అని ఆయన వర్గం అంటోంది. చూడాలి మరి గ్రంధి మే నెలలో చేసే ప్రకటన ఎలా ఉండబోతోందో.