భరణం చెల్లించేందుకు దొంగతనాలు.. ఈ కన్నయ్య కథ తెలుసుకోవాల్సిందే!
అవును... నాగ్ పూర్ లో ఒక నిరుద్యోగి తన మాజీ భార్యకు కోర్టు ఆదేశాలకు మేరకు నెల నెలా భరణం చెల్లించడానికి గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు.
By: Tupaki Desk | 19 July 2025 3:29 PM ISTఇటీవల కాలంలో దంపతుల మధ్య జరుగుతున్న విభేదాల ఫలితాలుగా.. హత్యలు, విడాకులు, కేసులు, భరణాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెలువడే పలు తీర్పులపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో మాజీ భార్యకు భరణం చెల్లించడం కోసం దొంగతనం చేస్తూ దొరికిన ఓ వ్యక్తి కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అవును... నాగ్ పూర్ లో ఒక నిరుద్యోగి తన మాజీ భార్యకు కోర్టు ఆదేశాలకు మేరకు నెల నెలా భరణం చెల్లించడానికి గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు. మన్కాపూర్ లోని గణపతినగర్ నివాసి కన్హయ్య నారాయణ్ గా గుర్తించబడిన నిందితుడు.. ఇటీవల జరిగిన ఒక దోపిడీ కేసును దర్యాప్తు చేస్తుండగా అరెస్టు చేయబడ్డట్లు పోలీసులు తెలిపారు.
బైక్ పై వచ్చిన దుండగుడు 74 ఏళ్ల జయశ్రీ జయకుమార్ అనే వృద్ధురాలి బంగారు గొలుసును దోచుకున్నాడు. ఈ ఘటన ఫిబ్రవరి 22న జరిగింది. దీనిపై ఆమె ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో.. నిఘా సమాచారం పోలీసులను కన్నయ్య వద్దకు తీసుకెళ్లింది. విచారణలో అతను దీంతోపాటు, మరికొన్ని దొంగతనాల నేరాలు అంగీకరించాడు!
వాస్తవానికి కన్నయ్యకు తన భార్యతో విడాకులయ్యాయి. ఈ సందర్భంగా... ఆమెకు నెల నెలా రూ.6,000 జీవనభృతి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే కోవిడ్ మహమ్మారి సమయంలో మరో వివాహం చేసుకున్న కన్నయ్య.. రెండేళ్లుగా నిరుద్యోగిగా ఉన్నట్లు చెబుతున్నారు. అయినప్పటికీ మొదటి భార్యకు చెల్లించాల్సిన సొమ్ము కోసం దొంగతనాలు మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో తాను దొంగిలించిన ఆభరణాలను స్థానిక బంగారం వ్యాపారి కృష్ణారావు నఖతేకు విక్రయించాడట. ఈ సమయంలో సోదాలు నిర్వహించిన పోలీసులు రూ.1.85 లక్షల విలువైన 10 గ్రాముల బంగారంతో పాటు ఒక మోటర్ సైకిల్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసినందుకు నఖతేను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన కన్నయ్య... ఉద్యోగం లేకపోయినప్పటికీ నెలకు రూ.6వేలు భరణం చెల్లించాల్సి రావడంతో మరో దారి తోచలేదని అన్నాడు. దీంతో చాలా మంది మగవాళ్లు కన్నయ్య పరిస్థితిని చూసి జాలిపడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి! మరోవైపు ఈ ఘటన సమాజాన్ని ఆలోచింపచేస్తోందని అంటున్నారు!
