Begin typing your search above and press return to search.

పికిల్స్ గొడవ.. ఇక ఆపేస్తే బెటర్

తెలుగు సోషల్ మీడియా యూజర్లను గత వారం రోజులుగా ఊపేస్తున్న విషయం.. అలేఖ్య చిట్టి పికిల్స్ గొడవే.

By:  Tupaki Desk   |   6 April 2025 10:19 PM IST
పికిల్స్ గొడవ.. ఇక ఆపేస్తే బెటర్
X

తెలుగు సోషల్ మీడియా యూజర్లను గత రెండు రోజులుగా ఊపేస్తున్న విషయం.. అలేఖ్య చిట్టి పికిల్స్ గొడవే. పచ్చళ్ల రేట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయని అడిగినందుకు అలేఖ్య చిట్టి ఓనర్ వాట్సాప్‌లో ఒక కస్టమర్‌ను దారుణమైన బూతులు తిట్టడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ముందు ఇది చిన్న విషయంగానే కనిపించింది కానీ.. రాను రాను పెద్ద గొడవగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ కావడం.. పాత ఆడియోలు, వీడియోలు కూడా కొన్ని బయటికి రావడంతో నెటిజన్లకు ముగ్గురు సిస్టర్స్ టార్గెట్ అయిపోయారు. చేసిన తప్పుకు బేషరతుగా క్షమాపణ చెబితే అయిపోయేది. కానీ సమర్థించుకుంటూ వీడియోలు చేయడం, కవర్ చేయడానికి ప్రయత్నించడంతో వ్యవహారం చేయి దాటిపోయింది. నెగెటివిటీ బాగా పెరిగిపోయి పికిల్స్ బిజినెస్సే మూత పడే పరిస్థితి వచ్చింది.

ఐతే సోషల్ మీడియా జనాలకు ఏదైనా టాపిక్ దొరికితే శ్రుతి మించి పోతారన్న సంగతి తెలిసిందే. అలేఖ్య చిట్టి సిస్టర్స్‌ను కూడా మరీ దారుణంగా టార్గెట్ చేశారు. ఆ తిట్టు తప్పే అయినప్పటికీ.. ఆ ముగ్గురి పట్ల నెగెటివిటీ మరీ ఎక్కువైపోవడం వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే ఆ కస్టమర్‌ను తిట్టిన అమ్మాయి తాను తప్పు చేసినట్లు ఒప్పుకుని బేషరతుగా క్షమాపణ చెప్పింది. మిగతా ఇద్దరు సిస్టర్స్ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. తమ సోదరి వ్యాఖ్యలతో అవతలి వ్యక్తులు ఎంత బాధ పడి ఉంటారో తమకు అర్థమైందని.. ఇంతటితో ఈ వ్యవహారాన్ని వదిలేయాలని వేడుకున్నారు. కానీ నెటిజన్లు మాత్రం ఆగట్లేదు. ఇంకా ముగ్గురు సిస్టర్స్‌ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మరీ ఇంత నెగెటివిటీ కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రోలింగ్, విమర్శలు ఆపకపోతే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని అలేఖ్య చిట్టి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఆమె బోరున ఏడుస్తున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా నెటిజన్లు ఈ గొడవను ఇంతటితో ఆపాల్సిన అవసరం కనిపిస్తోంది.