రాజకీయాల్లోకి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి? పార్టీపై సస్పెన్స్
ఏపీ రాజకీయాలకు దూరంగా హైదరాబాద్ లో ఉంటున్న అలేఖ్య రెడ్డి ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.
By: Tupaki Political Desk | 12 March 2026 3:41 PM ISTనందరమూరి వారసుడు, దివంగత నటుడు తారకరత్నం భార్య అలేఖ్య రెడ్డి రాజకీయ ప్రవేశంపై విస్తృత ప్రచారం జరుగుతోంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తాను రాజకీయాల్లోకి వస్తానేమో అంటూ అలేఖ్యరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆమె ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు? రాజకీయాల్లోకి రావాలని ఎందుకు కోరుకుంటున్నారనే అంశమై నెట్టింట్ హాట్ టిబేట్ జరుగుతోంది. అలేఖ్య రెడ్డి భర్త తారకరత్న కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఉండగా, ఆమె పెదనాన్న మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి. భర్త కుటుంబం మొత్తం టీడీపీలో ఉండగా, ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అలేఖ్యరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
ఏపీ రాజకీయాలకు దూరంగా హైదరాబాద్ లో ఉంటున్న అలేఖ్య రెడ్డి ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. ఆమె హైదరాబాద్ లోనే రాజకీయాలు చేస్తారా? లేక సొంత రాష్ట్రం ఏపీకి మారతారా? అనేది చూడాల్సివుందని అంటున్నారు. అలేఖ్యరెడ్డి పెదనాన్న విజయసాయిరెడ్డి ఏపీలో కీలక నేతగా పనిచేశారు. ఆయన కొన్నాళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నా, మళ్లీ ఎప్పుడైనా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో అలేఖ్యరెడ్డి తన పెదనాన్నతోపాటు రాజకీయాల్లోకి వస్తారా? లేక సొంతంగా పాలిటిక్స్ స్టార్ట్ చేస్తారా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. అలేఖ్యరెడ్డి రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరతారనేది కూడా ఆసక్తి రేపుతోంది.
అలేఖ్యరెడ్డి అత్తవారి కుటుంబం మొత్తం ఏపీలో కీలకంగా వ్యవహరిస్తోంది. అలేఖ్యరెడ్డి భర్త తారకరత్నకు మేనత్త భువనేశ్వరితో ఎక్కువ సానిహిత్యం ఉండేదని చెబుతున్నారు. అదేవిధంగా మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే బాలయ్యతోనూ తారకరత్న మంచి సంబంధాలు కొనసాగించేవారని చెబుతున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా, యువనేత లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభానికి తారకరత్న హాజరయ్యారు. ఆ సమయంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆ సమయంలో అలేఖ్యరెడ్డికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు.
ఆ తర్వాత అలేఖ్యరెడ్డి బాగోగులు, ఇతర విషయాలు ఎప్పుడూ చర్చకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలపై అలేఖ్యరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయని అంటున్నారు. ‘‘నేను రాజకీయ కుటుంబం నుంచే వచ్చాను... కనుక రాజకీయాలలోకి వస్తానేమో?’’ అంటూ వ్యాఖ్యానించిన అలేఖ్యరెడ్డి ఏ పార్టీ అని ఇంకా అనుకోలేదని చెప్పడమే సందేహాలకు తెరలేపుతోంది. అలేఖ్యరెడ్డి భర్త తారకరత్న భర్త బంధువర్గం ఎక్కువగా టీడీపీలో ఉంది. ఆమె కూడా టీడీపీలో కొనసాగాలని అనుకుంటే ప్రత్యేకంగా ఇలా ప్రకటన చేయాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. ప్రత్యేకంగా ‘‘ఏ పార్టీయో ఇంకా తేల్చుకోలేదు’’ అని చెప్పడమే అనుమానాలను రేకెత్తిస్తోంది. టీడీపీ ముఖ్యనేతల ద్వారా తనకు న్యాయం జరగలేదన్న ఆలోచనలో అలేఖ్యరెడ్డి ఉన్నారా? అందుకే ఇలాంటి ప్రకటన చేశారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.
