Begin typing your search above and press return to search.

నందమూరి కుటుంబంతో గ్యాప్?! అలేఖ్య రెడ్డి ఎంట్రీపై ఎన్నో ఊహాగానాలు

రాజకీయాల్లోకి వస్తానంటూ దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడు నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   13 March 2026 8:00 PM IST
నందమూరి కుటుంబంతో గ్యాప్?! అలేఖ్య రెడ్డి ఎంట్రీపై ఎన్నో ఊహాగానాలు
X

రాజకీయాల్లోకి వస్తానంటూ దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడు నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. భర్త మరణం తర్వాత అత్తవారి కుటుంబం నుంచి సరైన ఆదరణ లభించకపోవడం వల్లే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. తనకు రాజకీయ నేపథ్యం ఉందని, తాను రాజకీయ ప్రవేశం చేస్తానని చెబితే, అందుకు దారితీసిన పరిస్థితులపై చర్చ జరుగుతుందనే ఆలోచనతోనే అలేఖ్యరెడ్డి ఇలా మాట్లాడి ఉంటారని అంటున్నారు. అలేఖ్యరెడ్డితో వివాహాంపై తొలి నుంచి తారకరత్న కుటుంబం అయిష్టంగానే ఉందని, ఆయన మరణించిన తర్వాత మరింత దూరం పెట్టిందన్న బాధ ఆమెను కుంగదీస్తోందని అంటున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఆమె రాజకీయాలను ఎంచుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ కి అలేఖ్యరెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూపై పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చే జరుగుతోంది. ఆ ఇంటర్వ్యూలో తారకరత్నను తలచుకుని అలేఖ్యరెడ్డి చాలా బాధపడ్డారు. తన పిల్లలకు నందమూరి కుటుంబం నుంచి ఆశించిన ఆదరణ లేదని వెల్లడించారు. ఈ క్రమంలోనే ‘‘నేను రాజకీయ కుటుంబం నుంచే వచ్చాను... కనుక రాజకీయాలలోకి వస్తానేమో?’’ అంటూ అలేఖ్యరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి భార్య తరపు బంధువైన అలేఖ్యరెడ్డి తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అయితే వీరి ప్రేమ వివాహాం నందమూరి కుటుంబానికి ఇష్టం లేదని, ఆ కారణంగా తారకరత్నను కుటుంబం నుంచి దూరం పెట్టారని చెబుతున్నారు. అయితే టీడీపీ యువనేత లోకేశ్ అంటే ఎంతో అభిమానించే తారకరత్న తన మేనత్త భువనేశ్వరి, బాబాయ్ బాలకృష్ణతో సఖ్యతగా ఉండేవారని చెబుతున్నారు. తారకరత్న తల్లిదండ్రులు దూరం పెట్టినా, బాలకృష్ణ మాత్రం తారకరత్న బాగోగులు చూసుకునేవారని అంటున్నారు. ఇక తారకరత్న మరణం తర్వాత బాలయ్యే అన్ని కార్యక్రమాలు దగ్గరుండి జరిపించారు. అటు తర్వాత కుటుంబం నుంచి సరైన మద్దతు లేదని అలేఖ్యరెడ్డి తాజాగా బయటపెట్టారు.

దీంతో ఆమె వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తారకరత్న కూడా రాజకీయాల్లోకి రావాలని ఉబలాట పడ్డారని చెబుతున్నారు. అయితే ఆయన హఠాన్మరణం వల్ల తారకరత్న ఆకాంక్షను తాను నెరవేర్చాలనే ఆలోచనతో అలేఖ్యరెడ్డి ఉన్నారని చెబుతున్నారు. తారకరత్న మరణం తర్వాత టీడీపీ పెద్దలు తనను వదిలేశారని, అప్పట్లో ఇచ్చిన హామీని మరచిపోయారని అలేఖ్యరెడ్డి భావిస్తున్నారని అంటున్నారు. అందుకే తగిన సమయంలో తన మనసులో మాటను బయటపెట్టారని అంటున్నారు. రాజకీయాలపై ఆసక్తి ఉందని చెప్పడం ద్వారా ఏపీ ప్రభుత్వంలో ఏదో ఒక నామినేటెడ్ పోస్టును ఆమె ఆశిస్తున్నట్లు ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.