మోకాళ్లపై కూర్చొని మరీ ఇటలీ ప్రధాని మెలోనీకి స్వాగతం పలికిన అల్బేనియా అధ్యక్షుడు!
కొన్ని స్వాగతాలు ప్రత్యేకంగా ఉంటాయి. మర్యాదను చాటుతూనే ఆత్మీయతను నింపుతాయి
By: Tupaki Desk | 17 May 2025 12:37 PM ISTకొన్ని స్వాగతాలు ప్రత్యేకంగా ఉంటాయి. మర్యాదను చాటుతూనే ఆత్మీయతను నింపుతాయి. రాజకీయ సదస్సులు అంటే సాధారణంగా అధికారికంగా, సంప్రదాయబద్ధంగా సాగుతాయి. కానీ, అల్బేనియా రాజధాని టిరానాలో జరిగిన యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ సదస్సులో మాత్రం ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఈ సదస్సుకు యూరోపియన్ యూనియన్ దేశాల అగ్రనేతలు హాజరయ్యారు. అయితే, ఈ సమావేశానికి విచ్చేసిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి అల్బేనియా అధ్యక్షుడు ఎడీ రమా స్వాగతం పలికిన తీరు అందరి హృదయాలను హత్తుకుంది. అధికారిక మర్యాదలను పక్కనపెట్టి, తన ఆత్మీయతను చాటుకుంటూ ఆయన ఆమెను మోకాళ్లపై కూర్చొని మరీ ఆహ్వానించారు.
మెలోనీ తన కారు దిగి వేదిక వైపు నడుచుకుంటూ వస్తుండగా.. అల్బేనియా అధ్యక్షుడు ఎడీ రమా ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చున్నారు. చేతులు జోడించి నమస్కారం చేస్తూ చిరునవ్వుతో ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. వర్షం కురుస్తున్నప్పటికీ ఆయన చూపిన ఈ అపూర్వమైన ఆత్మీయతకు మెలోనీ ఆశ్చర్యపోయి, చిరునవ్వుతో ప్రతిస్పందించారు. ఈ హృద్యమైన దృశ్యాలు అక్కడున్న కెమెరాల్లో బంధీ అయ్యాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.
అల్బేనియా అధ్యక్షుడు ఎడీ రమా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని తన 'ఇటాలియన్ సోదరి' అని పిలుచుకుంటారు. వారిద్దరి మధ్య స్నేహం చాలా ప్రత్యేకమైనది. ఆమె ఎప్పుడు కలిసినా ఆయన ఇలాగే ప్రత్యేకంగా పలకరిస్తారు. ఈ ఏడాది జనవరిలో మెలోనీ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఒక సదస్సులో కూడా ఎడీ రమా ఆమెకు మోకాళ్లపై కూర్చొని ఒక స్కార్ఫ్‌ను బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు ఇటాలియన్ భాషలో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడు కూడా వీరిద్దరికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఈసారి కూడా ఆయన తన ప్రత్యేకమైన స్వాగతంతో మెలోనీ హృదయాన్ని గెలుచుకున్నారు.
ఈ సంఘటన యూరోపియన్ రాజకీయ వేదికపై ఒక ప్రత్యేకమైన క్షణంగా నిలిచింది. అధికారిక మర్యాదలను పక్కనపెట్టి ఒక దేశాధినేత మరో దేశాధినేతకు చూపిన ఈ ఆత్మీయత, వారిద్దరి మధ్య ఉన్న స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచింది. ఈ సంఘటన యూరోపియన్ రాజకీయ వేదికపై ఒక కొత్త సంప్రదాయానికి నాంది పలికింది.
