Begin typing your search above and press return to search.

అమెరికాకు ర‌ష్యా అమ్మేసిన అల‌స్కాలో పుతిన్-ట్రంప్ ఏం చేయ‌నున్నారు?

అమెరికాలో ఉండేవారు చెప్పే క‌థ‌నం ప్ర‌కారం అయితే.. అల‌స్కాలో అపార‌మైన చ‌మురు నిల్వ‌లున్నాయి.

By:  Tupaki Desk   |   9 Aug 2025 11:00 PM IST
అమెరికాకు ర‌ష్యా అమ్మేసిన అల‌స్కాలో పుతిన్-ట్రంప్ ఏం చేయ‌నున్నారు?
X

ప్ర‌పంచ ప‌టంలో అమెరికాను గ‌మ‌నిస్తే... ఎక్క‌డో దూరంగా ఉన్న అలాస్కాను కూడా భాగంగా చూపిస్తారు. అసలు అమెరికాలో అదో రాష్ట్రం అని కూడా భావించ‌రు. అంత దూరంలో ఉంటుంది ఆ రాష్ట్రం. వాస్త‌వానికి ఇది ఒక‌ప్పుడు ర‌ష్యాకు చెందిన‌దే. 1867లో 7.2 మిలియ‌న్ డాల‌ర్ల‌కు అమెరికాకు అమ్మేసింది. దీన్నే అల‌స్కా ప‌ర్చేజ్ అని అంటారు. 1867 మార్చి 30న జ‌రిగిన మొద‌లైన‌ డీల్ అక్టోబ‌రు 18తో ముగిసింది. అల‌స్కాను బ్రిట‌న్ విస్త‌ర‌ణ దాడుల నుంచి కాపాడుకోవ‌డం భారంగా మారినందుకే ర‌ష్యా దాన్ని అమెరికాకు అమ్మేసింది అనేది చ‌రిత్ర‌. ఇదంతా జ‌రిగి 158 ఏళ్ల‌యింది.

ప్ర‌పంచం అంతా చ‌మురు అయిపోతే..

అమెరికాలో ఉండేవారు చెప్పే క‌థ‌నం ప్ర‌కారం అయితే.. అల‌స్కాలో అపార‌మైన చ‌మురు నిల్వ‌లున్నాయి. ప్ర‌పంచం అంతా చ‌మురు అయిపోతే.. అప్పుడు అల‌స్కాలోని నిల్వ‌ల‌కు బ‌య‌ట‌కు తీయాల‌నేది అమెరికా ఆలోచ‌న‌. ఇప్పుడు అల‌స్కా గురించి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తున్న‌దంటే... మూడున్న‌రేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్-ర‌ష్యా యుద్ధంపై చ‌ర్చ‌ల‌కు వేదిక కాబోతున్నందుకు.

భిన్న ధ్రువాల క‌ల‌యిక‌...

ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఇద్ద‌రు నాయ‌కులు హాట్ టాపిక్. ఒక‌రు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ అయితే... మ‌రొక‌రు టారిఫ్ ల మంత్రం జ‌పిస్తున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. వీరిద్ద‌రూ ఉక్రెయిన్ యుద్ధంపై అల‌స్కాలో ఈ నెల 15న భేటీ కానున్నారు. ట్రంప్ చాన్నాళ్లుగా ఈ యుద్ధాన్నిఆపుతామని ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఉక్రెయిన్ భూమి ర‌ష్యా ప‌రం...?

ఉక్రెయిన్-ర‌ష్యా సంధి ఒప్పందంలో భూభాగాల మార్పిడి ఉంటుంద‌ని ట్రంప్ సంకేతాలిచ్చారు. అంటే.. ర‌ష్యా ఆక్ర‌మించిన ఉక్రెయిన్ భూభాగాల‌ను ర‌ష్యాకు కొంత క‌ట్ట‌బెట్ట‌డం, వెన‌క్కు తీసుకోవ‌డం అయి ఉండొచ్చు. కానీ, దీనికి ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ స‌సేమిరా అంటున్నారు. ఇరువైపులా మేలు జ‌రిగేలా ఒప్పందం ఉంటుంద‌ని ట్రంప్ చెబుతున్నా జెలెన్ స్కీ విన‌డం లేదు. త‌మ ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌ను దెబ్బ‌తీసే ఇలాంటి చ‌ర్చ‌ల‌ను అంగీక‌రించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.