అగ్రరాజ్యాన్ని వణికించిన భూకంపం.. సునామీ వార్నింగ్
ఈ భూకంప తీవ్రత ఎంత ఎక్కువ అంటే.. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 7.3గా నమోదైంది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికల్ని జారీ చేశారు.
By: Tupaki Desk | 17 July 2025 9:56 AM ISTఈ ప్రపంచంలో ఎవరూ శక్తివంతులు కారు. పేరుకు అగ్రరాజ్యమని చెప్పుకోవచ్చు.. ప్రపంచ దేశాలను తన మాటలో.. చేతలతో బెదిరించొచ్చు. కానీ.. అంతటి సూపర్ పవర్ అయిన అమెరికా సైతం ప్రకృతి ముందు జుజుబినే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని పలు దేశాలకు జారీ చేస్తున్న హెచ్చరికలు అన్నిఇన్ని కావు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రకృతి ప్రకోపంతో అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు మూడు రోజుల క్రితమే అమెరికాలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీవర్షం.. దాని కారణంగా చోటు చేసుకున్న విధ్వంసం ఒక కొలిక్కి రాకముందే.. మరోఉత్పాతం ఎదురైంది అమెరికాలోని అలస్కా తీరంలో భారీ భూకంపం చోటు చేసుకుంది.
ఈ భూకంప తీవ్రత ఎంత ఎక్కువ అంటే.. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 7.3గా నమోదైంది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికల్ని జారీ చేశారు. అలస్కా స్థానిక (బుధవారం) మధ్యాహ్న సమయం 12.37 గంటల ప్రాంతంలో ఈ భారీ భూకంపం చోటు చేసుకుందని.. దీని స్థావరం.. సౌండ్ పాయింట్ ద్వీప పట్టణానికి సౌత్ లో 87 కిలోమీటర్ల దూరంలో ఉందని చెబుతున్నారు. భూ ఉపరితలం నుంచి 20.1 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
భూకంపం నేపథ్యంలో దక్షిణ అలస్కా.. అలస్కా ద్వీపకల్పానికి సునామీ ముప్పు ఉందని హెచ్చరిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. ఈ సునామీ హెచ్చరికల్ని దూర ప్రాంతాలకు జారీ చేయలేదు. విపత్తు వేళ.. అత్యవసర సేవల విభాగం పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తోందని చెబుతున్నారు. ప్రజల్ని అప్రమత్తం చేసే వ్యవస్థల్ని యాక్టివేట్ చేశారు. తరచూ భూకంపాలు సంభవించే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో అలస్కా ఒక భాగమన్న సంగతి తెలిసిందే.
1964 మార్చిలో ఇక్కడ 9.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదేనని చెబుతారు. ఈ భూకంపం.. అనంతరం చోటు చేసుకున్న సునామీల కారణంగా 250 మందికి పైనే మరణించారు. 2023 జులైలో నూ అలస్కా ద్వీపకల్పంలో 7.2 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. భూకంపాలు తరచూ వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో అలస్కా ఉందన్న సంగతి తెలిసిందే.
ఈ ప్రాంతంలో 130 కంటే ఎక్కువ అగ్నిపర్వతాలు ఉన్నాయి. గడిచిన 200 ఏళ్లలో విస్ఫోటనం చెందిన అమెరికాలోని అగ్నిపర్వతాల్లో అత్యధికం ఇక్కడే ఉన్నాయి. భూకంప తీవ్రత తెలిపే వీడియోల్ని పలువురు పోస్టు చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. అయితే.. అధికార యంత్రాంగం మాత్రం ప్రజల్ని హెచ్చరించి వారికి అవసరమైన భద్రతా ఏర్పాట్లను చూసుకుంటున్నారు. సునామీ హెచ్చరికలు జారీ చేసిన గంట తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు.
