Begin typing your search above and press return to search.

దేశంలో పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ.. ఆన్సర్ ఉందా కేటీఆర్?

రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది కౌలు రైతులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు'' అంటూ మాజీ ఐఏఎస్ అధికారి అకునూరి మురళి మండిపడుతున్నారు.

By:  Tupaki Desk   |   4 Oct 2023 4:18 AM GMT
దేశంలో పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ.. ఆన్సర్ ఉందా కేటీఆర్?
X

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ.. పెద్ద పెద్ద హోర్డింగులు.. ప్రచార హోరుతో తెలంగాణ గొప్పతనాన్ని.. తమ పాలనలో రాష్ట్రం ఎంతలా వెలిగిపోతుందన్న విషయాన్ని చాటింపు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇందులో భాగంగా పలు అంశాల్ని ప్రస్తావిస్తూ.. దేశంలోనే ఏకైక రాష్ట్రం అంటూ పలు ఉదాహరణల్ని ప్రస్తావిస్తున్న కేసీఆర్ సర్కారుకు ఒక సూటి ప్రశ్నను సంధిస్తున్నారు.

యావత్ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అవినీతిని కేసీఆర్ చేసినట్లుగా మండిపాటు వ్యక్తమవుతోంది. అంతేకాదు.. దేశంలో పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణగా వ్యాఖ్యానిస్తున్నారు. 'ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి ఇంత అవినీతి చేయలేదు. ఐఏఎస్.. ఐపీఎస్.. ప్రభు్తవ అధికారులు ఇంత కరప్షన్ చేసే వాళ్లు కాదు. మూడేళ్లలో రూ.75 వేల కోట్లు రైతుబంధు పథకం కింద పంచారు.

ఇందులో రూ.28వేల కోట్ల భారీ మొత్తాన్ని రైతులు కాని ఎన్నారైలు.. సినీ నటులు.. మంత్రులకు ఇచ్చారు. సీఎం కేసీఆర్ సైతం రైతుబంధు తీసుకోవటం పిచ్చి పాలనకు పరాకాష్ఠ. రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది కౌలు రైతులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు'' అంటూ మాజీ ఐఏఎస్ అధికారి అకునూరి మురళి మండిపడుతున్నారు.

అవినీతిని అందరు ముఖ్యమంత్రులు చేస్తున్నారన్న ఆయన.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం ఈ విషయంలో వంద పీహెచ్ డీలు ఇవ్వొచ్చంటూ నిప్పులు చెరిగారు.

పాతరోజుల్లోనూ అవినీతి ఉన్నప్పటికీ.. ఇప్పటి అవినీతి రూపురేఖలు పూర్తిగా మారిపోయినట్లుగా వ్యాఖ్యానించారు. తనకు కమిషన్లు వచ్చే ప్రాజెక్టులనే కేసీఆర్ చేపడుతున్నట్లుగా ఆరోపించారు.

ఎనిమిదేళ్ల క్రితం ఒక ఎమ్మెల్యే ఆస్తి ఇప్పుడెంత? అన్నది చూస్తే.. దోపిడీ స్థాయి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చన్న మండిపాటు వ్యక్తమవుతోంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఎన్నో చేస్తున్నట్లుగా చెప్పుకునే ముఖ్యమంత్రి.. వ్యవసాయం చేసే రైతులకు పంట బీమా సౌకర్యాన్ని ఎందుకు కల్పించలేదు? కౌలు రైతుల్ని ఆదుకునేలా ఒక్క నిర్ణయాన్ని కూడా ఎందుకు ప్రకటించలేదు? అన్న ప్రశ్నలకు ఏం సమాధానాలు చెబుతారు? అని ప్రశ్నిస్తున్నారు.