రూ.లక్షకు చేరువైనా పసిడిని కొనటం ఆపలేదట
శుభదినంగా అక్షయ తృతీయకు ఉన్న పేరు ప్రఖ్యాతులు అన్నిఇన్ని కావు. ఈ రోజున బంగారం ఎంత కొన్నా.. దానికి రెట్టింపు బంగారాన్ని సదరు ఏడాదిలో కొనటం ఖాయమన్న సెంటిమెంట్ ఎక్కువ.
By: Tupaki Desk | 1 May 2025 4:01 AMశుభదినంగా అక్షయ తృతీయకు ఉన్న పేరు ప్రఖ్యాతులు అన్నిఇన్ని కావు. ఈ రోజున బంగారం ఎంత కొన్నా.. దానికి రెట్టింపు బంగారాన్ని సదరు ఏడాదిలో కొనటం ఖాయమన్న సెంటిమెంట్ ఎక్కువ. ఈ కారణంతోనే అవసరం ఉన్నా లేకున్నా.. ఖరీదు ఎంతన్నది పట్టించుకోకుండా అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు.
గత ఏడాది అక్షయ తృతీయ రోజున పది గ్రాముల బంగారం ధర రూ.72,300 ఉంటే.. ఈ ఏడాది అందుకు భిన్నంగా పది గ్రాముల బంగారం ధర రూ.99,900 పలికింది. అంటే.. ఏడాది వ్యవధిలో పది గ్రాముల మీద పెరిగిన భారం ఏకంగా 37.6 శాతం. అయినప్పటికి అమ్మకాల జోరు తగ్గకపోవటం విశేషంగా చెప్పాలి.
అక్షయ తృతీయ రోజున దేశ వ్యాప్తంగా రూ.12 వేల కోట్ల విలువైన 12 టన్నుల బంగారాన్ని.. రూ.4వేల కోట్ల విలువైన వెండిని కలిపి మొత్తం రూ.16వేల కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆలిండియా జువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్ఫర్మ్ చేస్తున్నారు. అక్షయ తృతీయ రోజున భారీగా పసిడి అమ్మకాలు జరగ్గా.. అందుకు భిన్నంగా ఈ ఏడాది జనవరి - మార్చి మొదటి మూడు నెలల కాలంలొ బంగారం డిమాండ్ దాదాపు 15 శాతం తగ్గినట్లుగా చెబుతున్నారు.
అధికర ధరల కారణంగా విలువ మాత్రం 22 శాతం పెరిగినట్లుగా తెలుస్తోంది. 2025లో భారతదేశంలో పసిడి గిరాకీ 700-800 టన్నుల (టన్ను అంటే వెయ్యి కేజీలు) మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకు బంగారం ధరల్లో 25 శాతం మార్పు రావటం గమనార్హం. అక్షయ తృతీయ..పెళ్లిళ్ల సీజన్ బంగారం కొనుగోలు చేసేలా చేస్తుంది. బంగారాన్ని అధికంగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి విషయానికి వస్తే.. 25-40ఏళ్ల మధ్య ఉన్న వారు బంగారం.. వెండిని కొనేందుకు ఇష్టపడుతున్నట్లుగా గుర్తించారు. మొత్తంగా పెరిగిన బంగారం ధరతో పసిడి డిమాండ్ పెద్దగా తగ్గలేదని చెప్పక తప్పదు.