Begin typing your search above and press return to search.

ఈడీ, సీబీఐ రద్దు చేస్తా..అఖిలేశ్ యాదవ్ ప్రకటన

‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేశ్ యాదవ్ పలు షాకింగ్ కామెంట్లు చేశారు.

By:  Tupaki Desk   |   20 May 2024 4:00 AM GMT
ఈడీ, సీబీఐ రద్దు చేస్తా..అఖిలేశ్ యాదవ్ ప్రకటన
X

2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలను ఇరుకున పెట్టేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను వాడుకుంటున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని సైతం మోడీ ప్రభావితం చేసి తన గుప్పెట్లో పెట్టుకున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సంస్థలపై యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈడీ, సీబీఐని మూసివేయాలని ప్రతిపాదిస్తానంటూ అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేశ్ యాదవ్ పలు షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రతి రాష్ట్రంలో ఏసీబీ ఉందని, మళ్లీ ప్రత్యేకంగా సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకని అఖిలేశ్ ప్రశ్నించారు. మోసానికి పాల్పడితే ఐటీ శాఖ చూసుకుంటుందని, సీబీఐ ఎందుకని ఆయన అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలలైన ఈడీ, సీబీఐ, ఐటీలను బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈడీ, సీబీఐ మూసివేత ప్రతిపాదనను కూటమి ముందు ఉంచుతానని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు అఖిలేశ్ సమాధానమిచ్చారు.

మరోవైపు, 2024 ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి విజయం తథ్యమని, రాబోయేది తమ ప్రభుత్వమేనని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా తాము ఇండియా కూటమికి మద్దతిస్తామని, కేవలం బెంగాల్ లో మాత్రమే మద్దతివ్వడం లేదని దీదీ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు బీజేపీతో కాంగ్రెస్, సీపీఐ చేతులు కలిపాయని సంచలన ఆరోపణలు చేశారు. టీఎంసీ యేతర పార్టీలకు ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

మోడీ ‘ఝూటా ప్రధాని’ అంటూ దీదీ సెటైర్లు వేశారు. తప్పుడు సమాచారం వ్యాపించేలా చేయడం, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడం ఆయన నైజం అని మండిపడ్డారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 2019లో మోడీ హామీ ఇచ్చారని, ఇప్పటికి 10 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు.