తన దిష్టిబొమ్మ దహనం చేసి గాయాలపాలైన బాధితురాలిని పరామర్శించిన ఎస్పీ చీఫ్..
తనను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలో ఈ ప్రమాదం జరిగినప్పటికీ, అఖిలేశ్ రాజకీయాలను పక్కన పెట్టారు.
By: Tupaki Political Desk | 29 April 2026 11:01 AM IST‘రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు ఉండడు.. శాశ్వత శత్రువు ఉండడు’ అనేది జగమెరిగిన సత్యం. నిన్నటి వరకు అత్యంత ప్రమాదకరమైన ప్రత్యర్థి నేటి నుంచి తన భవిష్యత్ కాపాడే మిత్రుడిగా మారచ్చు. ఇక ఒక పార్టీలో ఉంటే మరో పార్టీపై చేసే విమర్శలు సాధారణంగా ప్రతి రోజు చూస్తూనే ఉంటాం. అలాంటి సమయంలో వాటిని విమర్శలుగా స్వీకరించి సిద్ధాంత పరంగా శత్రువుగా చూడాలే తప్పితే వ్యక్తిత్వ పరంగా చూడద్దు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఒక ఘటన మనకు రాజకీయాల్లోని పరిణతిని సూచిస్తోంది. రాజకీయాల్లో ఎంతటి విభేదాలు ఉన్నా, ఆపద సమయంలో ఒకరినొకరు పరామర్శించుకోవడం ప్రజాస్వామ్యానికి అందం తెచ్చే గొప్ప విషయం. తన దిష్టిబొమ్మను దహనం చేస్తూ గాయపడ్డ ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేను కలిసి పరామర్శించడం రాజకీయం కంటే మానవత్వం గొప్పదని నిరూపిస్తోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు దేశంలో హాట్ టాపిక్ ఎప్పుడూ రసవత్తరంగా విమర్శలతో సాగుతుంటాయి. కానీ, తాజాగా జరిగిన ఒక పరిణామం అందరినీ ఆశ్చర్యపరిచింది. మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ జరుగుతున్న రాజకీయ పోరాటంలో భాగంగా, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌పై నిరసన తెలుపుతూ బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆమెకు గాయాలవ్వగా, అఖిలేశ్ స్వయంగా ఆమెను పరామర్శించడం రాజకీయాల్లో ఒక ఉన్నతమైన సంప్రదాయాన్ని చాటిచెప్పారు.
ఘటన నేపథ్యం..
ఈ నెల 25న మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో అఖిలేశ్ యాదవ్ తీసుకున్న వైఖరిని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు యూపీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిరసనలో భాగంగా అఖిలేశ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గాలి దిశ మారడం వల్ల లేదంటే పెట్రోల్ వినియోగం వల్ల మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. మంటల వేడికి దగ్గరలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్ తలకు, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మానవ సంబంధాలే ముఖ్యం
తనను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలో ఈ ప్రమాదం జరిగినప్పటికీ, అఖిలేశ్ రాజకీయాలను పక్కన పెట్టారు. ఎమ్మెల్యే ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న ఆయన, రాజకీయాలు అనేవి కేవలం విధానాల పరంగానే ఉండాలని, వ్యక్తిగత ద్వేషాలకు, మానవ సంబంధాలకు అడ్డు రావద్దని ట్వీట్ చేశారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు ఆపదలో ఉన్నప్పుడు వెళ్లి పరామర్శించడం ద్వారా ప్రజాస్వామ్యంలో చర్చలు ఎంత ముఖ్యమో, పరస్పర గౌరవం అంతే ముఖ్యమని ఆయన సందేశం పంపారు.
నిరసనలు ఒక హెచ్చరిక
ఒక వ్యక్తి గాయపడడం చాలా దురదృష్టకరం. ఈ ఘటన రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు పెద్ద పాఠం అనే చెప్పాలి. దిష్టిబొమ్మలు దహనం చేయడం నిరసనలో ఒక భాగమైనప్పటికీ, జనాల మధ్య పెట్రోల్ వంటి ప్రమాదకరమైన ఇంధనాలు వాడడం అత్యంత ప్రమాదకరం. రాజకీయ నిరసనలు ఉద్రేకంతో సాగుతున్నప్పుడు భద్రతా నియమాలను విస్మరిస్తే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి.
వ్యక్తిగత దూషణలు, శత్రుత్వంతో నిండిపోతున్న నేటి రాజకీయాల్లో అఖిలేశ్ యాదవ్ ఈ చర్య ఆదర్శంగా నిలుస్తుంది. రాజకీయాల్లో వైరుధ్యాలు ఉండాలి కానీ, అవి మనుషుల మధ్య విభేదాలకు దారి తీయకూడదు. తనను తిట్టిన వారైనా, తన దిష్టిబొమ్మను తగలబెట్టిన వారైనా.. ఆపదలో ఉంటే వెళ్లి పలకరించే సంస్కృతి భారతీయ రాజకీయాల్లో పుంజుకోవాలి. ఈ పరామర్శ ఎమ్మెల్యే అనుపమను త్వరగా కోలుకోవాలనే మనోధైర్యాన్ని ఇవ్వడమే కాదు.., కార్యకర్తల్లో మార్పు తీసుకువస్తుందని ఆశిద్దాం.
