Begin typing your search above and press return to search.

అఖిలకు ఆదరణ కరువైందా?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం.. ఆళ్లగడ్డ. ఇక్కడ భూమా కుటుంబానికి ఎంతో చరిత్ర ఉంది

By:  Tupaki Desk   |   7 Feb 2024 4:30 PM GMT
అఖిలకు ఆదరణ కరువైందా?
X

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం.. ఆళ్లగడ్డ. ఇక్కడ భూమా కుటుంబానికి ఎంతో చరిత్ర ఉంది. గతంలో భూమా శేఖరరెడ్డి, ఆయన సోదరుడు భూమా నాగిరెడ్డి, నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి, వీరి కుమార్తె అఖిలప్రియ ఇలా ఎంతోమంది ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అఖిలప్రియ మంత్రిగా చేయగా, ఆమె తల్లి శోభా నాగిరెడ్డి ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్‌ పర్సన్‌ గా బాధ్యతలు నిర్వర్తించారు. అఖిల తండ్రి భూమా నాగిరెడ్డి ఎంపీగా కూడా పనిచేశారు.

కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున అఖిలప్రియ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆమెకు సొంత ఇంటి నుంచే ఆదరణ కరువైందని టాక్‌ నడుస్తోంది. అఖిలప్రియ పెద నాన్న కుమారుడు, ప్రస్తుతం ఆళ్లగడ్డ బీజేపీ ఇంచార్జి భూమా కిశోర్‌ రెడ్డి, అఖిలప్రియ మేనత్త శ్రీదేవి.. ప్రస్తుతం ఆమెకు వ్యతిరేకంగా మారారు.

కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భూమా కిశోర్‌ రెడ్డి, శ్రీదేవి.. అఖిలప్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి మాట్లాడుతూ.. అఖిలకు భూమా కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ భూమా కుటుంబం అంతా వచ్చే ఎన్నికల్లో కిషోర్‌ రెడ్డికే మద్దతు ఇస్తుందని వెల్లడించారు. అఖిలప్రియకు మద్దతు ఇచ్చేదే లేదని కుండబద్దలు కొట్టారు. అఖిల ప్రియ.. భూమా కుటుంబానికి చెందింది కాదని హాట్‌ కామెంట్స్‌ చేశారు. అఖిల ఆమె భర్త మద్దూరు భార్గవరామ్‌ కుటుంబానికి చెందిన వ్యక్తి అని బాంబుపేల్చారు.

వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి భూమా కుటుంబం తరఫున ఎమ్మెల్యేగా బరిలో ఉండేది తానేనని భూమా కిశోర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రచారానికి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు.

ఆళ్లగడ్డతో మద్దూరు అఖిలప్రియకు, ఆమె భర్త భార్గవరాంకు ఎలాంటి సంబంధం లేదని కిశోర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమా కుటుంబం అంటే తామేనని తేల్చిచెప్పారు. భూమా కుటుంబం అంటే మద్దూరు అఖిల ప్రియ ఎంతమాత్రం కాదన్నారు.

మద్దూరు అఖిలప్రియ చేసిన ఘోరాలు అందరికీ తెలుసని భూమా కిశోర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆమెను తమ ఫ్యామిలీ పక్కన పెట్టిందన్నారు. పొత్తులో భాగంగా బీజేపీ అధిష్ఠానం తనకు సీటు ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌ గా అయినా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అంతేకానీ, అఖిల ప్రియకు మద్దతు ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు.

ఇదంతా అఖిలప్రియ స్వయంకృతాపరాధమేనని అంటున్నారు. అఖిలప్రియ గతంలో మంత్రిగా ఉండగా హవా చెలాయించారని.. కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకుని ఇవ్వలేదని రగడ జరిగింది. అఖిల బంధువులు ఆమె ఇంటి ఎదురుగా టెంట్‌ వేసుకుని మరీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కోట్ల రూపాయల్లో అఖిల తమకు డబ్బులు ఇవ్వాలని ఆరోపించారు. ఆ డబ్బులు ఇచ్చేవరకు కదలబోమని భీష్మించారు.

మరోవైపు తన తండ్రికి నమ్మిన బంటు, ఆయన స్నేహితుడు అయిన ఏవీ సుబ్బారెడ్డిని సుపారీ ఇచ్చి అఖిల హత్య చేయించడానికి కుట్ర పన్నారని ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌ లో ఒక స్థలం విషయంలో కొందరిని కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించిన ఘటనలో అఖిల జైలుకు కూడా వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి ఆమె ప్రస్తుతం బెయిల్‌ పైన ఉన్నారు.

మరోవైపు అఖిల రెండాకులు చదివితే తాను నాలుగు ఆకులు చదివానన్నట్టు ఆమె భర్త భార్గవరామ్‌ వ్యవహారం ఉందని అంటున్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలు, వివాదాలు, మోసాలు, గొడవలు, కిడ్నాపులు, హత్యకు కుట్ర.. ఇలా అఖిల, ఆమె భర్త భార్గవ రామ్‌ ఒకరికి ఒకరు తీసిపోరని అంటున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అఖిలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని భూమా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఆమెకు సీటు రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని టాక్‌ నడుస్తోంది. ఒకవేళ సీటు ఇచ్చినా ఓడించడం ఖాయమంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ తరఫున పోటీ చేయనున్న భూమా కిశోర్‌ రెడ్డికే తమ మద్దతు ఉంటుందని భూమా కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ ఒంటరైనట్టేనని ప్రచారం జరుగుతోంది. ఆమెకు సొంత కుటుంబ సభ్యుల ఆదరణ లేనట్టేనని చెబుతున్నారు. మరి ఈ పరిస్థితిని అఖిల ఎలా అధిగమిస్తారో వేచిచూడాల్సిందే.