ఉండవల్లిలో అక్కినేని నాగార్జున.. చంద్రబాబుతో స్పెషల్ మీటింగ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలుగు సినీ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కలిశారు.
By: Tupaki Desk | 3 Jun 2025 1:25 PM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలుగు సినీ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి ఈ ఉదయం వచ్చిన నాగార్జున సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన కుమారుడు అక్కినేని అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబుకు అందజేశారు. అఖిల్ వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
చంద్రబాబు, నాగార్జున భేటీ సినీ, రాజకీయ వర్గాలను ఆకర్షించింది. రాజకీయాలకు దూరంగా ఉండే నాగార్జున తెలుగు సినీ ఇండస్ట్రీలో తిరుగులేని కథనాయకుడిగా కొనసాగుతున్నారు. ఇక చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి గ్యాప్ ఉందని ఇటీవల వార్తలు ప్రచారమయ్యాయి. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరముల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ చేయాలన్న అంశం వివాదాస్పదమైంది.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసిన లేఖలో టాలీవుడ్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా సినీ పెద్దలు ఎవరూ సీఎం చంద్రబాబును కలవడానికి రాలేదని ఆ లేఖలో డిప్యూటీ సీఎం కార్యాలయం ఆక్షేపించింది. దీనిపై సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుండగా, నాగార్జున సీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వీరి భేటీ పూర్తి వ్యక్తిగతమని, సినీ ఇండస్ట్రీకి ఈ కలయికకు సంబంధం లేదని చెబుతున్నారు.
కాగా, నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య-శోభిత వివాహం గత ఏడాది జరుగగా, ఈ నెల 6న అఖిల్ వివాహం జరగనుంది. హైదరాబాద్ అమ్మాయి జైనబ్ ను అఖిల్ పెళ్లి చేసుకోనున్నారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉండగా, ఇరు కుటుంబాలు సమ్మతితో వివాహం చేసుకోనున్నారు. ఈ వేడుకకు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను నాగార్జున ఆహ్వానించారు.
