Begin typing your search above and press return to search.

అఖండ కాంగ్రెస్ ...వైసీపీ గురించే హాట్ డిస్కషన్ !

అఖండ భారతం అన్నది ఆర్ఎస్ఎస్ నినాదంగా ఉంది. అయితే ఇపుడు కాంగ్రెస్ లో సరికొత్త నినాదం వినిపిస్తోంది. అది అఖండ కాంగ్రెస్ అని. అంటే ఒకనాడు అన్ని రాష్ట్రాలలో చీలిలకు పేలికలు లేకుండా ఒక బలమైన శక్తిగా కాంగ్రెస్ ఉంటూ వచ్చింది.

By:  Satya P   |   13 Jun 2026 9:51 AM IST
అఖండ కాంగ్రెస్ ...వైసీపీ గురించే హాట్ డిస్కషన్ !
X

అఖండ భారతం అన్నది ఆర్ఎస్ఎస్ నినాదంగా ఉంది. అయితే ఇపుడు కాంగ్రెస్ లో సరికొత్త నినాదం వినిపిస్తోంది. అది అఖండ కాంగ్రెస్ అని. అంటే ఒకనాడు అన్ని రాష్ట్రాలలో చీలిలకు పేలికలు లేకుండా ఒక బలమైన శక్తిగా కాంగ్రెస్ ఉంటూ వచ్చింది. మళ్ళీ పునర్ వైభవం కోసం కాంగ్రెస్ తన పూర్వ శక్తిని సంతరించుకోవాలన్నదే ఈ నినాదం వెనక ఉన్న విషయం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే ప్రాంతీయ పార్టీలు అనేక చోట్ల అవతరించాయన్నది భారత రాజకీయ చరిత్ర చెప్పే సత్యం. ఇపుడు ఆ ప్రాంతీయ పార్టీలను లేకుండా బీజేపీ చేస్తోంది. ప్రతీ రాష్ట్రంలో వాటిని దాటుకుని ముందుకు బీజేపీ పోతోంది. దాంతో తమ అస్తిత్వం కోసం ప్రాంతీయ పార్టీలు పోరాటమే చేయాల్సి వస్తోంది.

కాంగ్రెస్ కి జీవన్మరణం :

మరో వైపు చూస్తే గత మూడు ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోతున్న వైనంగా కాంగ్రెస్ పరిస్థితి ఉది. అధికారానికి దూరం అయి ఇప్పటికి పుష్కర కాలం గడచింది. 2029 లో కూడా ఓటమి చెందితే ఏకంగా రెండు దశాదాల పాటు కాంగ్రెస్ ఈ వియోగం భరించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఉంటే కనుక కాంగ్రెస్ మూలాలు కూడా పూర్తిగా బక్కచిక్కి ఏ పరిస్థితికి చేరుకుంటుందో అన్న చర్చ కూడా సాగుతోంది. ఇదీ జాతీయ కాంగ్రెస్ లో పడుతున్న అంతర్మధనం. ఇలా దేశంలో బీజేపీ విశ్వరూపంతో కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా పూర్తిగా అణగారిపోతున్న నేపధ్యంలో అంతా కలసిపోతే ఒక్కటిగా సంఘటితం అయితే ఎలా ఉంటుంది అన్న సరికొత్త ఆలోచన వచ్చినట్లుగా చెబుతున్నారు.

కాంగ్రెస్ ని వీడిన వారంతా :

నిజానికి చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ని వీడి బయటకు వెళ్ళిన వారితో ఏర్పాటు చేసినవే అని గుర్తు చేస్తున్నారు. శరద్ పవార్ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేత. ఆయన ఆ పార్టీని వీడి మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ లో మంతా బెనర్జీ కాంగ్రెస్ లోనే ఎదిగిన నాయకురాలు అందులోనే ఎంపీ అయ్యారు. కానీ ఆమె తరువాత కాలంలో సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ ని ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో చూస్తే వైసీపీ కూడా కాంగ్రెస్ ని వీడి సొంతంగా ఏర్పాటు అయినదే అని అంటున్నారు. ఇవే కాకుండా దేశంలో పలు రాష్ట్రాలలో అస్థిత్వ పోరాటం చేస్తున్న ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయని అంటున్నారు.

విలీనం ప్రచారంతోనే :

తాజాగా మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అని ప్రచారం అయితే మొదలైంది. ఇది ఎక్కడ పుట్టిందో కానీ అలా సాగుతోంది. దానికి అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మమతా బెనర్జీ సొంతంగా బెంగాల్ లో బీజేపీతో పోరాటం చేయలేని స్థితి ఉంది. పైగా ఆమె పార్టీలో చీలికలు వచ్చేశాయి. దాంతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో విలీనం ద్వారా బెంగాల్ లో బీజేపీ మీద బలమైన పోరాటం చేయవచ్చు అన్నది కూడా ఒక అంచనాగా చెబుతున్నారు. మహారాష్ట్రలో చూస్తే శరద్ పవార్ పార్టీని ఓడించి మరీ బీజేపీ వరుసగా రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్సీపీలో కూడా చీలిక తెచ్చింది. శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ అయితే అధికార బీజేపీలో చేరిపోయారు. కానీ ఆయన ఈ ఏడాది జనవరిలో మరణించారు. దాంతో ఎన్సీపీ పరిస్థితి మరింత అయోమయంలో పడింది అని అంటున్నారు. కురు వృద్ధుడు అయిన ఆయన రాజకీయ పోరాటం చేయలేని స్థితి ఉంది. ఆయన కుమార్తె సుప్రియా సూలే పార్టీని నడిపిస్తున్నా కూడా కాంగ్రెస్ లో విలీనం అయితే మరింత బలంగా ఉండొచ్చు అన్న ప్రచారం సాగుతోంది.

జగన్ సంగతేంటి :

ఇక ఏపీ విషయం తీసుకుంటే బలంగా టీడీపీ కూటమి ఉంది. మూడు పార్టీలతో అత్యంత పటిష్టంగా కూడా ఉంది. 2029 లో జగన్ ఒంటరిగా పోటీ చేస్తే చేదు ఫలితాలు వస్తే కనుక మరో అయిదేళ్ళ పాటు వైసీపీని నడిపించడం సాధ్యమేనా అన్న చర్చ ఉంది. మరి వైసీపీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేస్తారా లేక పొత్తులు పెట్టుకుంటారా అన్నది కూడా చర్చగానే ఉంది. అయితే వైసీపీ కాంగ్రెస్ లో విలీనం కానీ పొత్తులు కానీ చేసే ప్రసక్తి ఉండదని అంటున్న వారూ ఉన్నారు. జగన్ కాంగ్రెస్ ని వీడిందే చాలా కారణాలతో అని చెబుతున్నారు. శరద్ పవార్ మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి విలీనం అన్న చర్చ సాగుతోంది వైసీపీ అయితే న్యూట్రల్ గా ఉంటోంది అని గుర్తు చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఎపుడూ అవసరాలే కీలక పాత్ర పోషిస్తాయి. అలా ఆలోచించినప్పుడు వైసీపీ 2029 నాటికి పొత్తులకు వెళ్తుందా లేక కీలక నిర్ణయాలు ఉంటాయా అంటే వేచి చూడాల్సిందే మరి.