అజిత్ పవార్ విమానం వెనుక భయంకర నిజాలు!
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నింపిన అజిత్ పవార్ విమాన ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
By: Tupaki Political Desk | 28 Jan 2026 12:38 PM ISTమహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నింపిన అజిత్ పవార్ విమాన ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి బయటకు వస్తున్న ఒక్కో నిజం విస్తుగొలిపేలా ఉంది. ముఖ్యంగా బుధవారం ఉదయం బారామతిలో కూలిపోయిన అదే విమానం గతంలోనూ ప్రమాదానికి గురవ్వడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తూ మరణించిన లియర్ జెట్ 45 (రిజిస్ట్రేషన్: వీటీ - ఎస్ఎస్.కే) విమానం గత చరిత్ర ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకసారి చావు అంచు వరకు వెళ్లి వచ్చిన విమానమే.. ఇప్పుడు ఐదుగురి ప్రాణాలను బలి తీసుకోవడం గమనార్హం.
2023లో తప్పిన పెను ప్రమాదం
ఈ విమానం మొదటిసారి వార్తల్లోకి వచ్చింది 2023 సెప్టెంబర్‌లో. ముంబై విమానాశ్రయంలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ ప్రైవేట్ జెట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. అయితే రన్‌వేపై పట్టు కోల్పోయి పక్కకు దూసుకెళ్లి అదుపుతప్పింది. నాటి ఘటనలో విమానంలో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం తీవ్రంగా దెబ్బతింది, ప్రయాణికులు గాయపడ్డారు కానీ ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ప్రమాదం తర్వాత విమానానికి మరమ్మతులు చేసి, సాంకేతిక అనుమతులు పొందినట్లు చూపిస్తూ మళ్లీ గాల్లోకి పంపారు.
బారామతిలో ఏం జరిగింది?
బుధవారం ఉదయం 8:45 గంటల సమయంలో ముంబై నుంచి బారామతికి చేరుకున్న ఈ విమానం ల్యాండింగ్‌కు కొద్ది నిమిషాల ముందు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. రెప్పపాటు కాలంలోనే నేలకూలి మంటల్లో చిక్కుకుంది. అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్ఓ), అటెండెంట్ ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మరణించారు. ఢిల్లీకి చెందిన వీఎస్ఆర్ వెంచర్స్ అనే సంస్థ ఈ విమానాన్ని చార్టర్ సర్వీసుగా నడుపుతోంది.
అనుమానాల సుడిగుండంలో భద్రతా లోపాలు
ఒకసారి ప్రమాదానికి గురై తీవ్రంగా దెబ్బతిన్న విమానాన్ని అత్యంత కీలకమైన రాజకీయ నేతల ప్రయాణాలకు ఎలా అనుమతించారనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.గత ప్రమాదం వల్ల విమానం స్ట్రక్చర్‌లో ఏదైనా అంతర్గత బలహీనత ఉండిపోయిందా? ప్రమాదానికి గురైన విమానానికి క్లియరెన్స్ ఇచ్చిన అధికారులు ఎవరు? ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించలేదా లేక యంత్ర వైఫల్యమా? అన్నది తేలాల్సి ఉంది.
డీజీసీఏ రంగంలోకి..
ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. విమాన గమనాన్ని రికార్డ్ చేసే బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించనున్నారు. గత రెండేళ్లుగా ఈ విమానానికి చేసిన మరమ్మతుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
ఆరుసార్లు ఉపముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన అజిత్ పవార్ ఇలాంటి విమాన ప్రమాదంలో మరణించడం మహారాష్ట్రకు తీరని లోటు. పాత ప్రమాదాల చరిత్ర ఉన్న విమానాలను వీఐపీల కోసం వాడటంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
