రష్యాకు అజిత్ దోవల్.. ఉద్రిక్తతల వేళ తెరపైకి రెండు కారణాలు!
ఈ నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటన విషయం తెరపైకి వచ్చింది. ఇందుకు రెండు కారణాలున్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 23 May 2025 5:00 PM ISTఆపరేషన్ సిందూర్ తో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాల్పుల విరమణ అంగీకారంతో కాస్త సైలంట్ గా ఉన్నప్పటికీ.. అది తుపాను ముందు ప్రశాంతతే అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి! ఈ నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటన విషయం తెరపైకి వచ్చింది. ఇందుకు రెండు కారణాలున్నాయని అంటున్నారు.
అవును... అజిత్ దోవల్ వచ్చే వారం రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మే 27 నుంచి 29 వరకూ భద్రతా వ్యవహారాల ఉన్నతస్థాయి ప్రతినిధుల 13వ అంతర్జాతీయ సమావేశం జరగనున్న నేపథ్యంలో.. ఈ సమావేశంలో పాల్గొనేందుకు అజిద్ దోవల్ మాస్కోకు వెళ్లనున్నట్లు తెల్లుస్తోంది. దీంతోపాటు మరోకారణం కూడా ఉందని తెలుస్తోంది.
ఇందులో భాగంగా... రష్యా వద్ద పెండింగ్ లో ఉన్న ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ముందస్తు డెలివరీ అంశంపై చర్చించనున్నారని అంటున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. వాస్తవానికి రష్యా నుంచి ఐదు ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు 2018లోనే భారత్ ఒప్పందం చేసుకొంది.
రూ.35 వేల కోట్ల విలువ గల ఈ డీల్ అనంతరం ఇప్పటివరకూ మూడు ఎస్-400 వ్యవస్థలు భారత్ కు చేరుకోగా.. మిగిలిన వాటిని వచ్చే ఏడాది ఆగస్టు నాటికి అందించే అవకాశాలున్నట్లు ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ వార్తలొచ్చాయి! అయితే... అంతకంటే ముందుగానే మిగిలిన రెండు వ్యవస్థలను డెలివరీ చేసేలా డోవల్ మాస్కోతో చర్చించనున్నట్లు చెబుతున్నారు!
కాగా... ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ఆటలను ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ కట్టించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఎస్-400 వ్యవస్థ విజయవంతంగా నిలువరించగలిగింది.. వాటిని నిర్వీర్యం చేయగలిగింది. దీంతో.. భారత్ ముందు పాక్ ఆటలు సాగలేదు!