మోదీ నమ్మిన మాస్టర్ మైండ్.. డోవల్ వ్యూహంతో సక్సెస్ అయిన ‘ఆపరేషన్ సింధూర్’!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది.
By: Tupaki Desk | 8 May 2025 2:00 AM ISTపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసి, శత్రువులకు గట్టి బుద్ధి చెప్పింది భారత్. ఈ ఆపరేషన్ వెనుక ప్రధాన సూత్రధారిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ కీలక పాత్ర పోషించారు. చాలా వ్యూహాత్మక ఆలోచనలతో, శత్రువులను మట్టుబెట్టే సామర్థ్యంతో ఆయన ప్రధాని మోదీకి నమ్మిన బంటుగా మారారు.
1968 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అజిత్ డోవల్, అసాధారణ మేధస్సుతో శత్రువుల గుట్టు రట్టు చేయడంలో దిట్ట. ఆయనను తరచుగా ‘ఇండియా జేమ్స్ బాండ్’ అని పిలుస్తారు. పాకిస్తాన్‌లో ఏడేళ్లు రహస్యంగా గడిపి, అక్కడి కీలక సమాచారాన్ని భారత్‌కు అందించారు. ఖలిస్తాన్ ఉగ్రవాదం సమయంలో ఉగ్రవాద గ్రూపుల్లోకి చొరబడి, సమాచారం సేకరించారు. ఆపరేషన్ బ్లాక్ థండర్‌కు ముందు గోల్డెన్ టెంపుల్ ప్రాంతంలో రిక్షా పుల్లర్‌గా పనిచేశారు. కాందహార్‌లో IC 814 హైజాకర్లతో చర్చలు జరపడంలో కీలక పాత్ర పోషించారు. ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన డోవల్, విదేశీ, సైనిక ఆపరేషన్లలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
భారత్‌లో ఉగ్రదాడుల నియంత్రణలో డోవల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 2016లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలపై జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ వెనుక మొత్తం ప్లాన్ డోవల్ అమలు చేసినట్లు చెబుతారు. తాజాగా, పహల్గాం ఘటన తర్వాత ‘ఆపరేషన్ సింధూర్’ సక్సెస్ కావడంలోనూ ఆయనదే కీలక పాత్ర. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రధాని మోదీకి ఎప్పటికప్పుడు సమాచారం అందించారు.
‘ఆపరేషన్ సింధూర్’ గురించి ప్రపంచ దేశాలకు వివరించిన డోవల్, వారి మద్దతు కూడగట్టారు. పాక్ వ్యవహార శైలి మారకపోతే, భారత్ మరింత గట్టిగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. అయితే, ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారులకు, కార్యదర్శులకు ఆయన ఈ ఆపరేషన్ వివరాలు తెలియజేశారు.
‘ఆపరేషన్ సింధూర్’లో పాక్‌లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 5 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది. రాజౌరి - ఫూంచ్ ప్రాంతాల్లోని లష్కరే తోయిబా శిబిరాలపై క్షిపణులు ప్రయోగించారు. ఈ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. బవహల్పూర్ (జైషే మహమ్మద్), మురిద్కే (లష్కరే తొయిబా) శిబిరాల్లో అత్యధిక మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
